
I. ఇంటిని విడిచి వెళ్లడం
నుదుటి చెమట చిందించి నే చేసిన శ్రమకు
ఇప్పటివరకు దక్కిన పంట ముళ్లూ గచ్చలే.
చెప్పు తండ్రీ, ఇదెలా సాధ్యం?
ఇన్ని వైఫల్యాలు నీకు సంతోషం కలిగించగలవా?
ఇతరులు నీ నేలలో నాకంటే బాగా విత్తగలరు.
నా విలువకంటే నాకోసం చేసిన ఖర్చే ఎక్కువ కాదా?
నిన్ను నిరాశపరచి, మరింత దుఃఖపెట్టడం కంటే
ఇప్పుడే నేను వెళ్లిపోవడం మేలు.
సామానంతా సర్దుకొని, నా వారసత్వపు వాటాతో
నీ సన్నిధిని విడిచి వెళుతున్నాను.
వృథా అయిన నా శ్రమంతటి వేదనను
పరదేశపు భోగాలు మొద్దుబార్చుతాయి.
నేను బయలుదేరిన ఆ రోజు నుంచీ
కరువు నా దేహాన్నీ హృదయాన్నీ ఆకలితో అలమటింపజేసింది.
బూటకపు వాగ్దానాలను నమ్మాను.
ఇంతకాలమూ నేను మోసపోయానా?
II. తిరుగు రాక
అంతరాత్మ పిలుస్తోంది: “ఇంటికి తిరిగి వెళ్లు!”
అక్కడ నా ఆహారాన్ని సంపాదించుకోగలనని ఆశించవచ్చు.
నా ఈ పాపాలకు పరలోకమే సాక్షి.
ఇక ఈ పందులతో కలిసి తినను.
“తండ్రీ,” అని అంటాను, “నేను చేసిన పనులన్నిటినిబట్టి,
నీ కుమారుడనని పిలిపించుకోవడం నాకు మించిన గౌరవం.
మరింత కష్టపడి పనిచేస్తానని నీకు మాటిస్తున్నాను,
ఇంతకంటే మంచి సేవకుడనవుతాను.”
చిరిగిన బట్టలతో, నాకు నేనే చేసుకున్న గాయపు మచ్చతో ఉన్న నన్ను
దూరం నుంచే నీవు చూసినప్పుడు,
నీ తండ్రి హృదయం నుంచి పొంగిన కరుణ
నాకు వస్త్రాలు తొడిగి, ఇక ఎన్నడూ విడిచి వెళ్లవద్దని కోరుతోంది.
నీ సంపదను సగానికి తగ్గించిన నాకోసం
నీవు కొవ్విన దూడను వధిస్తున్నావా?
తండ్రీ, నేను ఇలా మారిపోయినందుకు నాపై నాకే ద్వేషం.
చెప్పు, నీవెలా పండుగ చేసుకోగలవు?
III. పండుగ
అతి ప్రియమైన కుమారుడా, ఒకప్పుడు నీవు నాతో ఉన్నావు,
నేను ఓర్పుతో నీతో కలిసి పనిచేస్తూ,
ప్రతి నేలలోనూ విత్తనాలు విత్తుతున్నప్పుడు,
నీ సమక్షంలో నేను ఆనందం పొందాను.
హృదయ కలవరం నిన్ను భయానికి లోనుచేసింది.
నీవు వెళ్లిపోయినప్పుడు, నేనిక్కడ వేచి ఉన్నాను,
నిన్ను మళ్లీ నా పక్కన ఉంచుకోవాలని
నీ కోసం దూరదూరాల వరకూ వెదుకుతూ ఉన్నాను.
ఇప్పుడు నీవు సజీవంగా, క్షేమంగా ఇంటికి చేరావు.
పాత అబద్ధాలను శాశ్వతంగా పారద్రోలు!
నీవు ఇక్కడ నాతోనే ఉంటే,
నీవు దేనికీ, ఎవరికీ భయపడనవసరం లేదు.
తండ్రీ, నన్ను దారితప్పనీయకు.
నా అనుదిన ఆహారాన్ని నేడు నాకు దయచేయి.
మరెక్కడో కలతతో మేల్కొని ఉండటం కంటే
నీ నమ్మకమైన సంరక్షణలో నిద్రించడం మేలు.
IV. ఆహ్వానం
దారితప్పిన కుమారుని గురించి నేను వింటున్నదేమిటి?
అతడు తిరిగిరాగానే విందు మొదలైందా?
నేను కష్టపడి చేస్తున్న సేవను ఆపేసి ఉండాల్సింది,
అప్పుడు నేనూ విందును ఆస్వాదించేవాడిని.
రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తూ,
అన్నీ క్షుణ్ణంగా చూసే నీ చూపు కింద బానిసలా పనిచేశాను.
నా ప్రతి చిన్న తప్పూ
నన్ను మరింత శ్రమకు కట్టిపడేసింది.
కన్నీళ్లతో, చెమటతో నాకోసం విత్తినందుకు,
ప్రియమైన కుమారుడా, విచారించకు.
నీ లాభాలకంటే నీ ప్రయత్నాలనూ
నీ శ్రమలోని బాధలనూ నేను ఎక్కువగా లెక్కించాను.
నీ సోదరుడు ఇప్పుడు తిరిగి వచ్చాడు.
మాతో కలిసి నీవు భోజనానికి కూర్చోవాలనీ,
నాకున్నదంతా నీదేనని నీవు తెలుసుకోవాలనీ
నేను ఆరాటపడిన ఈ ఇంటిలోకి రా.
-ఫా. తిమోతి జె. డ్రేపర్
ప్రధాన చిత్రం: తప్పిపోయిన కుమారుని తిరుగు రాక, బార్తొలోమే ఎస్తెబాన్ మురిల్లో చిత్రించినది
