
మరియ [ఎలిజబెతు]తో దాదాపు మూడు నెలలు ఉండి, ఆ తరువాత తన ఇంటికి తిరిగి వెళ్లింది. లూకా 1:56
మన ధన్యమాతలో పరిపూర్ణంగా ఉన్న ఒక అందమైన గుణం నిష్ఠ. తన కుమారునిపట్ల ఆమెకున్న ఈ నిష్ఠ మొదట ఎలిజబెతుపట్ల ఆమె చూపిన నిష్ఠలో వ్యక్తమైంది.
మాత మరియ స్వయంగా గర్భవతి అయినప్పటికీ, గర్భవతిగా ఉన్న ఎలిజబెతుకు పరిచర్య చేయడానికి వెళ్లింది. ఎలిజబెతు గర్భధారణ చివరి నెలలు సౌకర్యంగా గడిచేలా తనకు చేతనైనదంతా చేస్తూ, తన సమయాన్ని మూడు నెలలపాటు అంకితం చేసింది. ఆమె మాట వినడానికి, అర్థం చేసుకోవడానికి, సలహా ఇవ్వడానికి, సేవ చేయడానికి, కేవలం తన ఆప్యాయతను వ్యక్తపరచడానికి మరియ అక్కడ ఉండి ఉంటుంది. ఆ మూడు నెలలలో దేవమాత సాన్నిధ్యం వల్ల ఎలిజబెతు ఎంతో దీవెన పొందివుంటుంది.
నిష్ఠ అనే సద్గుణం తల్లిలో ప్రత్యేకంగా బలంగా ఉంటుంది. యేసు సిలువపై మరణిస్తున్నప్పుడు, ఆయన ప్రియమైన తల్లి కల్వరిలో తప్ప మరెక్కడా ఉండేది కాదు. ఆమె ఎలిజబెతుతో మూడు నెలలు, సిలువ పాదాల వద్ద ఆ సుదీర్ఘమైన మూడు గంటలు గడిపింది. ఇది ఆమె అంకితభావం ఎంత గాఢమైనదో వ్యక్తపరిచింది. ఆమె ప్రేమలో చలించలేదు; చివరివరకు నిష్ఠతో నిలిచింది.
ఇతరుల కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ చూపవలసిన సద్గుణం నిష్ఠ. ఇతరులు అవసరంలో ఉన్నా, బాధపడుతున్నా, దుఃఖంలో ఉన్నా లేదా హింసకు గురవుతున్నా చూసినప్పుడు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. బలహీనతతో, స్వార్థంతో వారి నుంచి దూరంగా వెళ్లిపోవడమా, లేక వారి వైపు తిరిగి, వారికి అండగా నిలిచి బలాన్నిస్తూ, వారితో కలిసి వారి సిలువలను మోయడమా అనేది ఎంచుకోవాలి.
ఈ రోజు మన ధన్యమాత నిష్ఠను గురించి ధ్యానించండి. ఆమె తన జీవితమంతా స్నేహితురాలిగా, బంధువుగా, భార్యగా, తల్లిగా నిష్ఠతో జీవించింది. భారం ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఆమె ఎన్నడూ వెనుకాడలేదు. ఇతరుల పట్ల అచంచలమైన నిబద్ధతతో ప్రవర్తించమని దేవుడు మిమ్మల్ని ఏ విధంగా పిలుస్తున్నారో ధ్యానించండి. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? సంకోచించకుండా ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కరుణగల హృదయంతో వారి గాయాలను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మన ధన్యమాతలోని ఈ పవిత్ర సద్గుణాన్ని స్వీకరించి, ఆచరించడానికి కృషి చేయండి. అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వాలని, మీరు ప్రేమించవలసిందిగా మీకు అప్పగించబడినవారి సిలువల చెంత నిలవాలని నిర్ణయించుకోండి.
అత్యంత ప్రియమైన మాతా, ఆ మూడు నెలలపాటు ఎలిజబెతు పట్ల నీవు చూపిన నిష్ఠ, ఆదరణకు, శ్రద్ధకు, సేవకు ఒక అందమైన ఆదర్శంగా నిలిచింది. నీ ఆదర్శాన్ని అనుసరించడానికి, అవసరంలో ఉన్నవారిని ప్రేమించేందుకు నాకు ఇవ్వబడిన అవకాశాలను ప్రతిరోజూ వెదకడానికి నాకు సహాయం చేయుము. పెద్ద పనుల్లోనూ చిన్న పనుల్లోనూ సేవ చేయడానికి నేను సంసిద్ధంగా ఉండేలా, ప్రేమించాలనే నా పిలుపులో ఎన్నడూ తడబడకుండా ఉండేలా చేయుము.
అత్యంత ప్రియమైన మాతా, నీ కుమారుని సిలువ ఎదుట పరిపూర్ణ నిష్ఠతో నిలిచిన నీవు చివరి వరకు నిష్ఠతో ఉన్నావు. వేదనలో ఉన్న నీ ప్రియ కుమారుని చూస్తూ నిలబడటానికి నీకు బలాన్నిచ్చింది నీ మాతృహృదయమే. నా సిలువల నుంచిగాని, ఇతరులు మోసే సిలువల నుంచిగాని నేను ఎన్నడూ ముఖం తిప్పుకోకుండా ఉందునుగాక. నా సంరక్షణకు అప్పగించబడిన వారందరికీ నేను కూడా నిష్ఠతో కూడిన ప్రేమకు ప్రకాశవంతమైన ఆదర్శంగా ఉండేలా నా కొరకు ప్రార్థించుము.
నా అమూల్య ప్రభువా, నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నన్ను నీకు అంకితం చేసుకుంటున్నాను. నీ వేదనలోనూ బాధలోనూ నిన్ను చూస్తూ ఉండటానికి నిశ్చయించుకుంటున్నాను. ఇతరులలోనూ, వారి బాధలలోనూ నిన్ను చూడటానికి నాకు సహాయం చేయుము. అవసరంలో ఉన్నవారికి నేను బలమైన స్తంభంలా నిలవగలిగేలా, నీ ప్రియ తల్లి నిష్ఠను అనుకరించడానికి నాకు సహాయం చేయుము. నా ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా సర్వస్వంతో నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయుము.
మరియమాతా, నా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.
తొమ్మిదవ రోజు – లోకం స్వాగతించలేదు
ఈ-పుస్తకంగా & పేపర్బ్యాక్గా లభిస్తుంది!

