తెలుగు

తొమ్మిదవ రోజు – లోకం స్వాగతించలేదు


వీడియో రూపం

వారు అక్కడ ఉన్నప్పుడు, ఆమెకు ప్రసవ సమయం వచ్చింది; ఆమె తన ప్రథమ కుమారునికి జన్మనిచ్చింది. ఆమె ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రంలో వారికి చోటు లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టింది. లూకా 2:6-7

మన ధన్యమాత హృదయాన్ని నింపిన తొలి గొప్ప దుఃఖాలలో ఒకటి యేసు జన్మించిన వేళ కలిగింది. దేవమాత తన కుమారుడైన లోకరక్షకునికి జన్మనివ్వబోతున్న సమయంలో, వారికి స్వాగతం లభించిన ఏకైక చోటు పశువులు నివసించే స్థలమే కావడం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. సత్రంలో గానీ, మరే ఇంటిలో గానీ ఆయనకు చోటు లేదు. అది ఆమెకు ఎంతో కఠినమైన అనుభవమై ఉండాలి. తన కుమారుడే వాగ్దానం చేయబడిన మెస్సీయ అన్న అద్భుతమైన విషయం ఆమెకు తెలుసు. పవిత్రాత్మ తనను ఆవరించడం ద్వారా అద్భుతరీతిలో తాను ఆయనను గర్భం ధరించానని ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు జన్మించే సమయం వచ్చినప్పుడు, ఆయన మొదటిసారి తిరస్కరణకు గురయ్యారు. పశువులకు మేత వేసే తొట్టియే ఆయన తొలి పడక అయింది.

మరియ, యేసుల జీవితాలలో తిరస్కరణ ఒక భాగంగా ఉండేది. అది ఆయన జననంతో మొదలై సిలువపై ముగిసింది. మన ధన్యమాత అంతటా ఆయనతోనే ఉన్నారు. అయితే జీవితంలో వారు ఎదుర్కొన్న తిరస్కరణ వారి శాంతిసంతోషాలను ఎన్నడూ హరించలేదు. లోకం చూపిన తిరస్కరణను స్పష్టంగా మించిపోయినది ఒకటి ఉంది: ఈ తల్లీకుమారుల పరస్పర ప్రేమ. వారి మధ్య ఉన్న బంధం ప్రతిరోజూ వారిరువురికీ ఆధ్యాత్మిక ఆహారంగా నిలిచింది. తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా జీవించేలా, ఈ లోకంలో ఎదురైన తిరస్కరణ బాధను అధిగమించడానికి వారి పరస్పర ప్రేమ వారికి తోడ్పడింది.

జీవితంలో మనం కూడా తరచూ లోకం నుంచి తిరస్కరణను, అపార్థాన్ని, ఆదరణ లేకపోవడాన్ని అనుభవిస్తుంటాం. అలా జరిగినప్పుడు కోపపడటానికీ, చివరికి నిరాశలో పడిపోవడానికీ బలమైన శోధన కలుగుతుంది. తిరస్కరణను తట్టుకోవడానికి కీలకమైనది, మీ జీవితంలో దేవమాత, ఆమె కుమారుడైన యేసు మీపై చూపే ప్రేమను, మిమ్మల్ని సంపూర్ణంగా అక్కున చేర్చుకోవడాన్ని గురించి నిశ్చయంగా ఉండటమే. వారు ఎల్లప్పుడూ చేతులు చాచి మీకోసం ఉంటారు. వారు మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టరు. మిమ్మల్ని ఎన్నడూ తిరస్కరించరు.

వారు మిమ్మల్ని ప్రేమతో అక్కున చేర్చుకునే ఈ వరాన్ని మీరు కూడా ఇతరులకు అందించాలి. ఇతరులకు యేసు తల్లిగా ఉండటానికీ, స్వయంగా యేసుగానే ఉండటానికీ మీరు పిలువబడ్డారు. ఇతరులపట్ల మీరు చూపే శ్రద్ధకు, ఆదరణకు ఈ పవిత్ర కుటుంబం నుంచి మీరు పొందే ప్రేమే ప్రేరణ కావాలి.

ఈ రోజు రెండు విషయాలను ధ్యానించండి. మొదటిగా, దేవమాత, ఆమె కుమారుడైన యేసు మిమ్మల్ని ఎల్లప్పుడూ స్వాగతిస్తారని తెలుసుకోండి. మీరు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికి చెందినవారే. వారి కుటుంబ ప్రేమను ఇతరులకు అందించవలసిన మీ బాధ్యతను గురించి కూడా ధ్యానించండి. అవసరంలో ఉన్నవారి విషయంలోనూ, దేవుడు మీ సంరక్షణకు అప్పగించినవారి విషయంలోనూ ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. అన్ని విధాలా ఆదరించడంలో వెనుకాడకండి. ఎందుకంటే, మరొకరిని స్వాగతించే కార్యంలో మీరు స్వయంగా క్రీస్తునే స్వాగతిస్తున్నారని కనుగొంటారు.

అత్యంత ప్రియమైన తల్లీ, నన్ను ఎల్లప్పుడూ నీ బిడ్డగా స్వాగతిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీ కుమారునికి దగ్గరగా నేను విశ్రాంతి పొందుతున్నప్పుడు, నీ హృదయమే నాకు ఇల్లు కావాలి. ఈ జీవితంలో నాకు ఎదురయ్యే తిరస్కరణ నన్ను ఎన్నడూ వెనుకడుగు వేయించకుండునుగాక. బదులుగా, నీ కుమారుణ్ణి ఈ లోకంలోకి స్వాగతించినట్లే నన్నూ నీవు స్వాగతిస్తావని తెలుసుకొని, నేను ఎల్లప్పుడూ నీ ప్రేమపూర్వక ఆలింగనం వైపు తిరిగేలా చేయుము.

ప్రియమైన తల్లీ, ఈ లోకంలో తిరస్కరణను ఎదుర్కొనేవారిని ఎల్లప్పుడూ ఆదరించడానికి నాకు సహాయపడుము. అవసరంలో ఉన్న వారందరికీ స్వాగతం పలికే నీ హృదయానికి నేను ఒక సాధనంగా ఉండేలా చేయుము.

అమూల్యమైన ప్రభువా, తొట్టి తప్ప నీ తల వాల్చడానికి నీకు మరే చోటూ లేదు. అయినా నీకు కావలసిన స్వాగతమంతా నీ తల్లి సాన్నిధ్యంలోనే లభించింది. ఇతరులలో నిన్ను నీవు చూపించుకున్నప్పుడు, నిన్ను అక్కున చేర్చుకోవడానికి నా చేతులు చాచేలా నాకు సహాయపడుము. తిరస్కరణకు గురైనవారిని, అవసరంలో ఉన్నవారిని వెదకి చేరుకోవడానికి నాకు సహాయపడుము. వారికి నేను ఆ తొట్టిగా, నీ దివ్యప్రేమ నిలయంగా ఉండేలా చేయుము.

మరియమాతా, మా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పదవ రోజు – దుఃఖ ఖడ్గం

విషయ సూచిక

ఈ-పుస్తకంగా & పేపర్‌బ్యాక్‌గా లభిస్తుంది!