తెలుగు

రెండవ రోజు – విమల హృదయ బలం

వీడియో రూపం

యేసు సిలువ దగ్గర ఆయన తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలా మరియ నిలబడి ఉన్నారు. యోహాను 19:25

ఈ రోజు మనం మరోసారి, యేసు తల్లి సిలువ పాదాల వద్ద నిలబడి ఉన్న ఈ పరమ పవిత్ర దృశ్యాన్ని చూస్తున్నాము. ఆమె “నిలబడి ఉన్నది” అని యోహాను సువార్త చెబుతోందని గమనించండి.

మరియమాత అనుభవించిన మానవ భావోద్వేగం అపారమైనదీ, తీవ్రమైనదీ అనడంలో సందేహం దాదాపుగా లేదు. సిలువపై వేలాడుతున్న తన ప్రియ కుమారుని చూస్తున్నప్పుడు ఆమె హృదయం పగిలి, శూలంతో పొడిచినట్లయింది. అయినా, ఆయనను చూస్తూ ఆమె నిలబడి ఉన్నది.

ఆమె నిలబడి ఉండటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. తీవ్రమైన వ్యక్తిగత వేదన మధ్య ఆమె చూపిన ధైర్యాన్ని ఈ సువార్త భాగం చిన్నదైనా సూక్ష్మమైన ఈ వివరంతో చిత్రిస్తోంది. తాను పూర్ణహృదయంతో ప్రేమించిన వ్యక్తి పట్ల అంతటి క్రూరత్వాన్ని కళ్లారా చూడటంకన్నా ఆమెను ఎక్కువగా కుంగదీసేది మరొకటి ఉండదు. అయినప్పటికీ, భరించలేని ఈ వేదన మధ్య ఆమె తన దుఃఖానికి లొంగిపోలేదు, నిరాశలో కూరుకుపోలేదు. చివరివరకు తల్లి ప్రేమను విశ్వసనీయంగా నెరవేరుస్తూ, అపారమైన ధైర్యంతో ఆమె నిలబడి ఉన్నది.

సిలువ పాదాల వద్ద మన ధన్యమాత చూపిన ధైర్యానికి మూలం, అన్ని విధాలా నిష్కళంకమైన ఆమె హృదయమే. ఆమె హృదయం ప్రేమలో నిష్కళంకమైనది, సంపూర్ణ ధైర్యం గలది, సంపూర్ణ విశ్వాసపాత్రమైనది, సంకల్పంలో అచంచలమైనది; లోకంలోని కల్లోలం మధ్య కూడా ఎన్నడూ సడలని నిరీక్షణతో నిండినది. లోక దృష్టిలో, సంభవించగల అత్యంత ఘోరమైన విషాదం ఆమె కుమారునికి సంభవిస్తోంది. కానీ పరలోక దృష్టిలో, అదే క్షణంలో తన నిష్కళంక హృదయపు పవిత్ర ప్రేమను వ్యక్తపరచడానికి ఆమెకు ఆహ్వానం అందుతోంది.

పరిపూర్ణంగా ప్రేమించిన హృదయం మాత్రమే అంత బలంగా ఉండగలదు. ముఖ్యంగా, ఆమె హృదయంలో సజీవంగా ఉండి ఉండే నిరీక్షణ భక్తివిస్మయాన్ని కలిగించేదిగా, మహిమాన్వితంగా ఉండేది. అంతటి వేదనను ఎదుర్కొంటూ అలాంటి నిరీక్షణను, బలాన్ని కలిగి ఉండడం ఎలా సాధ్యం? దానికి ఒకే ఒక మార్గం ఉంది; అదే ప్రేమ మార్గం. మన ధన్యమాత విమల హృదయంలోని స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమ పరిపూర్ణమైనది.

ఈ రోజు, మన ధన్యమాత హృదయ బలాన్ని ధ్యానించండి. తన కుమారుని పట్ల ఆమెకున్న ప్రేమను తిలకించండి; ఈ స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రేమ మిమ్మల్ని భక్తివిస్మయంలోకి నడిపించనివ్వండి. మీ జీవితంలోని వేదన తీవ్రమై, భరించలేనిదిగా అనిపించినప్పుడు, ఈ తల్లి హృదయంలోని ప్రేమను గుర్తుచేసుకోండి. జీవితంలోని సిలువలను, కష్టాలను ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, ఆమె హృదయం మీ హృదయానికి ప్రేరణనివ్వాలని, ఆమె బలం మీ బలం కావాలని ప్రార్థించండి.

ఎంతో ప్రేమగల నా తల్లీ, నీ హృదయ స్వచ్ఛతలోకి, బలంలోకి నన్ను ఆకర్షించు. నీ కుమారుని పట్ల అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయనను చూస్తూ నీవు సిలువ పాదాల చెంత నిలిచావు. పరిపూర్ణ ప్రేమగల నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించు; తద్వారా నీ నుండి నాకు ప్రేరణ కలిగి, నీ మహిమాన్విత సాక్ష్యం ద్వారా నాకు బలం చేకూరును గాక.

నా ప్రియమైన తల్లీ, నీవు సిలువ పాదాల చెంత నిలిచినప్పుడు, ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచావు. సిలువ పాదాల చెంతకన్నా మేలైన స్థలం మరొకటి లేదు. భయంతోనో, వేదనతోనో, నిరాశతోనో దాక్కుంటూ, సిలువ నుండి ఎన్నడూ దూరం కాకుండా నాకు సహాయం చేయు. నా బలహీనత నుండి నాకు విముక్తి కలిగించు; నీ హృదయ ప్రేమలోని బలాన్ని నేను అనుకరించేలా నా కొరకు ప్రార్థించు.

అమూల్యమైన ప్రభువా, నీవు సిలువపై వ్రేలాడుతున్నప్పుడు, నీ హృదయ ప్రేమ నీ తల్లి హృదయంతో ఐక్యమవడానికి అనుమతించావు. మీ ఇద్దరి ఈ ప్రేమలోకి నన్ను ఆహ్వానించు; తద్వారా నీ వేదనలో, శ్రమలో నేను కూడా నీతో ఐక్యమవుదును గాక. ప్రియమైన ప్రభువా, నా చూపు ఎన్నడూ నీ నుండి మరలకుండును గాక. 

మరియమాతా, మా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

మూడవ రోజు – దేవమాత ఆలోచనలు

విషయ సూచిక

ఈ-పుస్తకంగా & పేపర్‌బ్యాక్‌గా లభిస్తుంది!