తెలుగు

మూడవ రోజు – దేవమాత ఆలోచనలు

వీడియో రూపం

యేసు సిలువ దగ్గర ఆయన తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలా మరియ నిలబడి ఉన్నారు. యోహాను 19:25

అలాంటి హింసను అనుభవించే చాలామందిలో అయోమయం, కోపం, నిరాకరణ భావాలు తలెత్తుతాయి. అలాంటి అనుభవాలను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం; హేతువిరుద్ధమైన, గందరగోళమైన ఆలోచనలకు లోనయ్యే శోధన బలంగా ఉంటుంది. మరి మన ధన్యమాత మనసులో ఏ ఆలోచనలు మెదిలి ఉంటాయి?

మరియమాతకు నిష్కళంక హృదయం మాత్రమే కాదు, పరిపూర్ణ విశ్వాసంతో పదునెక్కిన మనసు కూడా ఉంది. ఇప్పుడు పరలోకంలో ఆమెకు ఉన్నంత జ్ఞానం, అవగాహన అప్పటి ఆమె విశ్వాస జీవితంలో లేకపోయి ఉండవచ్చు. అయినా, ఈ ఘోరాన్ని తండ్రి చిత్తం అనుమతించిందని ఆమె తన విశ్వాసం ద్వారా ఎరిగింది. తన కుమారుడు తన దైవిక కార్యాన్ని నెరవేరుస్తున్నాడనే అత్యంత లోతైన సత్యాన్ని ఆమె మనసు గ్రహించి ఉండవచ్చు. ఈ విషాదం నిజానికి విషాదమే కాదని, అది ఎన్నడూ కనీవినీ ఎరుగని అత్యున్నత ప్రేమకార్యమని ఆమెకు తెలిసి ఉండవచ్చు.

ఆ క్షణంలో మరియమాత అనుభవించిన వేదనతో ఆమె విశ్వాసం మమేకమై ఉండవచ్చు. నిరాశకు లోనయ్యే శోధన ఎదురైనప్పుడు, ఆమె విశ్వాసం ఆమెకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి ఉండవచ్చు. ఆమె విశ్వాసం శోధనలన్నిటినీ స్పష్టతగా, దృఢనిశ్చయంగా మార్చి ఉండవచ్చు. చివరికి, దేవుని మనసు నుండి తనకు వెల్లడైన సత్యం ద్వారా ఆమె తన శోధనలను జయించి ఉండవచ్చు.

మన జీవితాల్లో కూడా బాధ మనలను అయోమయంలో, అనిశ్చితిలో పడవేస్తుంది. విశ్వాసాన్ని కోల్పోయేలా, పరలోక తండ్రి పరిపూర్ణ చిత్తాన్ని సందేహించేలా అది మనలను శోధిస్తుంది. తన కుమారుని బాధను ఎదుర్కొంటున్నప్పుడు, సత్యమే తన ఆలోచనలను నడిపించేందుకు అనుమతించిన మన ధన్యమాత సాక్ష్యం నుండి మనం నేర్చుకోవాలి. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, దానిని సందేహించే ప్రతి శోధనను విడిచిపెట్టడానికి ఆమెకు స్వేచ్ఛనివ్వగలిగింది సత్యం మాత్రమే.

మన ధన్యమాత పరిపూర్ణ విశ్వాసాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. సమస్తమూ దేవుని అధీనంలో ఉందనీ, తన కళ్లముందే తండ్రి చిత్తం నెరవేరుతోందనీ ఆమెకు ఉన్న సంపూర్ణ నిశ్చయమే ఆమె విశ్వాసం. అంతటి క్రూరత్వాన్ని అర్థం చేసుకోవడమనే అసాధ్యమైన పని లౌకిక జ్ఞానానికి మిగిలింది. అయితే, లోక రక్షణ కోసం తన కుమారుని మరణానికి ఆమె సమ్మతించినప్పుడు, పరలోక జ్ఞానం ఆమెను నడిపించింది.

ప్రియమైన మాతా, జీవితంలో ఎన్నోసార్లు దేవుని మార్గాలను సందేహించే శోధన నాకు కలుగుతోంది. నా సిలువలు, నా ప్రియమైనవారి సిలువలు నన్ను అయోమయంలో పడవేయవచ్చు. బాధలతో, వేదనతో నిండిన ఈ లోకంలో నేను పయనిస్తున్నప్పుడు, నీ పరిపూర్ణ విశ్వాసం నాకు కలిగేలా నా కోసం ప్రార్థించు. కేవలం లౌకిక జ్ఞానం నుంచే వచ్చే శోధనలు నన్ను ఎన్నడూ వెనుకడుగు వేయనీయకుండునుగాక. బదులుగా, పరలోక జ్ఞానపు సత్యం నా మనస్సును నింపి, నా జీవితానికి దిశ చూపేలా నేను దానికి చోటివ్వుదునుగాక.

ప్రియాతిప్రియమైన యేసూ, సిలువపై నీవు అనుభవించిన భరించలేని వేదనను నీ నిష్కళంక మాత ప్రత్యక్షంగా చూడటానికి నీవు అనుమతించావు. అయితే, ఆమె మనస్సుకు స్పష్టత కలగడానికి తోడ్పడేలా నీవు ఆమెకు పరలోక అంతర్దృష్టినీ జ్ఞానాన్నీ కూడా ప్రసాదించావు. ఇదే జ్ఞానాన్ని నాపైనా, సమస్త మానవజాతిపైనా కుమ్మరించు. అన్ని విషయాలలో నిన్నూ, నీ పరిపూర్ణ చిత్తాన్నీ తెలుసుకోవడానికి మాకు సహాయం చేయు. 

మరియమాతా, మా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

నాలుగవ రోజు – ఆధ్యాత్మిక స్నేహం

విషయ సూచిక

ఈ-పుస్తకంగా & పేపర్‌బ్యాక్‌గా లభిస్తుంది!