పవిత్ర గ్రంథ పఠనం: యోహాను 2:13–25
నేపథ్యం: పైన ఉన్న పవిత్ర గ్రంథ భాగాన్ని కనీసం ఒక్కసారైనా చదివిన తరువాత, దేవాలయ శుద్ధీకరణ గురించి సంక్షిప్తంగానూ వివరంగానూ బోధించే ఈ క్రింది అంశాలను చదవండి:
- పాస్కా పండుగ ప్రతి సంవత్సరం జరిగే పండుగలన్నిటిలో అత్యంత ముఖ్యమైనది. పురుషులందరూ ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉండేది. చాలామంది దేవునికి బలి అర్పించడానికి దేవాలయానికి తీర్థయాత్రగా వెళ్లి ఈ విధిని నెరవేర్చేవారు.
- ధనవంతులు గొర్రెలను లేదా ఎద్దులను అర్పించేవారు. పేదలు ఒక గువ్వను లేదా పావురాన్ని అర్పించేవారు.
- పండుగ కారణంగా దేవాలయం జనంతో కిక్కిరిసిపోయింది. ప్రభువు సన్నిధిలో హాజరై బలి అర్పించాలనే మతపరమైన విధిని ఆసరాగా చేసుకొని వారిలో చాలామంది డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు.
- యేసు డబ్బు మార్చేవారిని, పెద్ద జంతువులను అమ్మేవారిని ఎంతో బలంగానూ తీవ్రంగానూ దేవాలయం నుండి వెళ్లగొట్టారని, అయితే గువ్వలను, పావురాలను అమ్మేవారికి మాత్రం వాటిని దేవాలయం నుండి తీసుకుపొమ్మని హెచ్చరించారని పునీత ఇగ్నేషియస్ పేర్కొంటారు.
- యేసు దేవాలయాన్ని తన “తండ్రి ఇల్లు” అని పిలుస్తూ, దానితో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటారు.
- అందరినీ వెళ్లగొట్టడానికి యేసుకు అధికారం ఉందని చూపే సూచకక్రియను యూదులు అడిగినప్పుడు, వారు ఆ దేవాలయాన్ని కూల్చివేస్తే తాను దానిని మూడు రోజుల్లో తిరిగి నిర్మిస్తానని ఆయన చెబుతారు. వారు యేసును చంపిన మూడు రోజుల తరువాత ఆయన మృతులలో నుండి లేవడం గురించి ఇది ఒక ప్రవచనం.
- నిజమైన “దేవాలయం” తన సొంత శరీరమేనని కూడా యేసు స్పష్టం చేస్తారు. దేవుని పరిపూర్ణత నివసించే నూతన దేవాలయం ఆయనే.
- దేవుడు మనలో నివసిస్తున్నందున, దేవాలయాన్ని మన ఆత్మలకు ప్రతీకగా కూడా అర్థం చేసుకోవచ్చు. మనం దేవుని ఆలయమవుతాము. మన ఆత్మల నుండి ప్రతి పాపాన్ని అత్యంత ఆసక్తితో వెళ్లగొట్టడం యేసు కార్యలక్ష్యాలలో ఒకటి.
ధ్యానం: పవిత్ర గ్రంథంలోని ఈ సంఘటనను మరొకసారి చదివి, ఈ క్రింది విషయాలను మననం చేస్తూ మీ ధ్యానాన్ని ప్రారంభించండి:
- పండుగ సమీపించడాన్ని ధ్యానించండి. దానికి ముందున్న నెలలను, వారాలను ఊహించుకోండి. జరుగుతున్న ఏర్పాట్లను, ఎదురుచూపులను ఊహించుకోండి. ఈ సంఘటనకు ముందున్న నెలల్లో, ఇందులో భాగమైన వారందరి గురించి ఆలోచించండి: డబ్బు మార్చేవారు, అమ్మకందారులు, ధనవంతులు, పేదలు, యాత్రికులందరూ, యేసు మరియు ఆయన శిష్యులు.
- జనంతో కిక్కిరిసిన దేవాలయ ప్రాంగణంలోని కోలాహలాన్ని, జంతువుల వాసనను, శబ్దాన్ని, దురాశను, దేవాలయంలోని జంతువుల రక్తాన్ని, పొడి వేడిని మొదలైనవాటిని ఊహించుకోండి.
- యేసు దేవాలయానికి రావడాన్ని ఊహించుకోండి. తన తండ్రి ఇల్లు అపవిత్రం కావడాన్ని చూసినప్పుడు ఆయనలో ఉప్పొంగే ధర్మాగ్రహాన్ని ధ్యానించండి.
- తాళ్లతో చేసిన కొరడాను, యేసు జంతువులను వెళ్లగొట్టడాన్ని, బల్లలను పడదోయడాన్ని మొదలైనవాటిని ధ్యానించండి.
- ఇప్పుడు మీ ఆత్మ అనే దేవాలయం వైపు దృష్టి మళ్లించండి. అది కూడా తండ్రి ఇల్లే. మీరు దేవుని పవిత్ర నివాసస్థలం.
- మీ ఆత్మలోనికి మీరు అనుమతించిన పాపాన్ని, మలినాన్ని కూడా చూడండి. అలా చూస్తున్నప్పుడు, ఈ పాపాన్ని చూసి, దానిని వెళ్లగొట్టడానికి ఎంతో ఆసక్తితో ప్రయత్నిస్తున్న యేసును చూడండి. మీ స్పందన ఏమిటి? కృతజ్ఞత చూపుతున్నారా? లేక ప్రతిఘటిస్తున్నారా?
ప్రధాన చిత్రం:ఎల్ గ్రెకో చిత్రించిన దేవాలయాన్ని శుద్ధి చేస్తున్న క్రీస్తు
- ప్రభువు జ్ఞానస్నానం
- రెండు పతాకాలు
- మూడు వర్గాల మనుషులు
- శోధన
- అపొస్తలుల పిలుపు
- కానాలో వివాహం
- దేవాలయ శుద్ధీకరణ
- కొండమీది ప్రసంగం
- తుఫానును శాంతింపజేయడం
- నీటిపై నడవడం
- బోధించడానికి పంపబడిన అపొస్తలులు
- మగ్దలా మరియమ్మ పరివర్తన
- క్రీస్తు ఐదువేల మందికి ఆహారం ఎలా సమకూర్చారు
- క్రీస్తు దివ్యరూప ప్రకాశనం
- లాజరు పునరుత్థానం
- బేతనియలో విందు
- వినయానికి మూడు మార్గాలు
