తెలుగు

తపస్సుకాలం ఐదవ వారం

మనం కూడా వెళ్లి ఆయనతో పాటు మరణిద్దాం

తపస్సుకాలం ఐదవ ఆదివారం (సంవత్సరం A)
(గమనిక: విశ్వాస పరిశీలన కర్మలు జరిగేటప్పుడు B & C సంవత్సరాలలో కూడా ఈ సువార్తను ఐచ్ఛికంగా ఎంచుకోవచ్చు) 

అప్పుడు దిదిము అని పిలువబడే తోమా తన తోటి శిష్యులతో, “మనం కూడా వెళ్లి ఆయనతో పాటు మరణిద్దాం” అన్నాడు.  యోహాను 11:16

ఎంత గొప్ప మాట!  దీనిని అర్థం చేసుకోవడానికి సందర్భాన్ని తెలుసుకోవడం ముఖ్యం.  తన స్నేహితుడైన లాజరు అనారోగ్యంతో మరణానికి చేరువలో ఉన్నందున తాను యెరూషలేముకు వెళ్తున్నానని యేసు తన అపొస్తలులతో చెప్పిన తరువాత తోమా ఈ మాట అన్నాడు.  నిజానికి, ఈ సంఘటన కొనసాగుతున్నప్పుడు, యేసు లాజరు ఇంటికి చేరుకునేలోపే లాజరు మరణించాడు.  యేసు లాజరును మృతులలోనుండి లేపారని ఈ సంఘటన ముగింపు మనకు తెలుసు.  అయితే యేసుపట్ల తీవ్రమైన శత్రుత్వంతో ఉండి, ఆయనను చంపాలనుకున్నవారు చాలామంది ఉన్నారని అపొస్తలులకు తెలుసు కాబట్టి, ఆయన యెరూషలేముకు వెళ్లకుండా ఆపడానికి వారు ప్రయత్నించారు.  అయినా యేసు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు.  ఈ సందర్భంలోనే పునీత తోమా మిగిలినవారితో, “మనం కూడా వెళ్లి ఆయనతో పాటు మరణిద్దాం” అన్నాడు.  మళ్లీ చెప్పాలంటే, ఎంత గొప్ప మాట!

ఇది గొప్ప మాట, ఎందుకంటే యెరూషలేములో తమకు ఏమి ఎదురైనా స్వీకరించాలనే ఒక దృఢనిశ్చయంతో తోమా ఈ మాట అన్నట్లు కనిపిస్తుంది.  యేసుకు వ్యతిరేకత, హింస ఎదురవుతాయని ఆయనకు తెలిసినట్లే కనిపిస్తుంది.  యేసుతో కలిసి ఆ హింసను, మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది.  

తోమా సందేహించిన వ్యక్తిగా సుపరిచితుడన్నది నిజమే.  యేసు మరణించి పునరుత్థానమైన తరువాత, ఇతర అపొస్తలులు నిజంగా యేసును చూశారనే విషయాన్ని ఆయన అంగీకరించలేదు.  సందేహించినందుకు ఆయనకు అంత పేరు ఉన్నప్పటికీ, ఆ క్షణంలో ఆయన చూపిన ధైర్యాన్ని, దృఢనిశ్చయాన్ని మనం విస్మరించకూడదు.  ఆ క్షణంలో, యేసుకు ఎదురయ్యే హింసను, మరణాన్ని ఎదుర్కోవడానికి ఆయనతో పాటు వెళ్లేందుకు తోమా సిద్ధంగా ఉన్నాడు.  స్వయంగా మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.  చివరికి యేసును బంధించినప్పుడు ఆయన పారిపోయినప్పటికీ, ఆ తరువాత సువార్త ప్రచారకుడిగా భారతదేశానికి వచ్చి, అక్కడే అంతిమంగా విశ్వాసం కోసం హతసాక్షిగా మరణించాడని నమ్ముతారు.

మనకు ఎదురుకాగల ఎలాంటి హింసనైనా ఎదుర్కోవడానికి యేసుతో కలిసి ముందుకు వెళ్లేందుకు మనం ఎంత సిద్ధంగా ఉన్నామో ఆలోచించడానికి ఈ వాక్యభాగం మనకు తోడ్పడాలి.  క్రైస్తవులుగా జీవించడానికి ధైర్యం అవసరం.  మనం ఇతరులకంటే భిన్నంగా ఉంటాం.  మన చుట్టూ ఉన్న సంస్కృతికి అనుగుణంగా ఉండము.  మనం జీవిస్తున్న కాలపు తీరుతెన్నులకు అనుగుణంగా మారడానికి నిరాకరించినప్పుడు, దాని ఫలితంగా ఏదో ఒక రూపంలో హింసకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  దానికి మీరు సిద్ధంగా ఉన్నారా?  దీనిని సహించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

మనం విఫలమైనా మళ్లీ ప్రారంభించవచ్చని కూడా పునీత తోమా నుండి నేర్చుకోవాలి.  తోమా సిద్ధంగా ఉన్నాడు, కానీ హింస కనిపించగానే పారిపోయాడు.  ఆ తరువాత సందేహానికి లోనయ్యాడు; అయితే చివరికి యేసుతో పాటు వెళ్లి మరణించాలనే తన నిశ్చయానికి అనుగుణంగా ధైర్యంగా జీవించాడు.  మనం ఎన్నిసార్లు విఫలమవుతామనేది అంత ముఖ్యం కాదు; పరుగు పందెన్ని ఎలా ముగిస్తామనేదే ముఖ్యం.  

ఈ రోజు పునీత తోమా హృదయంలోని దృఢనిశ్చయాన్ని గురించి ఆలోచించండి; దాని వెలుగులో మీ సొంత దృఢనిశ్చయాన్ని ధ్యానించండి.  ఈ నిశ్చయాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైతే చింతించకండి; మీరు ఎప్పుడైనా తిరిగి లేచి మళ్లీ ప్రయత్నించవచ్చు.  పునీత తోమా హతసాక్షిగా మరణించినప్పుడు చాటిన అంతిమ దృఢనిశ్చయాన్ని గురించి కూడా ఆలోచించండి.  ఆయన ఆదర్శాన్ని అనుసరించాలని నిర్ణయించుకోండి; అప్పుడు మీరు కూడా పరలోకంలోని పునీతులలో లెక్కించబడతారు.

దృఢనిశ్చయంగల నా ప్రభువా, నీవు ఎక్కడికి నడిపించినా నిన్ను అనుసరించాలని ఆశిస్తున్నాను.  నీ మార్గాలలో నడవడానికి, పునీత తోమా ధైర్యాన్ని అనుకరించడానికి నాకు స్థిరమైన దృఢనిశ్చయాన్ని దయచేయి.  నేను విఫలమైనప్పుడు, తిరిగి లేచి మళ్లీ నిశ్చయించుకోవడానికి నాకు సహాయపడు.  ప్రియమైన ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను; నా జీవితంతో నిన్ను ప్రేమించడానికి నాకు సహాయపడు.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


మరణించడానికి పిలుపు

తపస్సుకాలం ఐదవ ఆదివారం, సంవత్సరం B

“నిజంగా, నిజంగా మీతో చెబుతున్నాను, గోధుమ గింజ నేలలో పడి మరణించకపోతే, అది కేవలం ఒక గోధుమ గింజగానే మిగిలిపోతుంది; కానీ అది మరణిస్తే, సమృద్ధిగా ఫలిస్తుంది.”  యోహాను 12:24

చాలామందికి మరణం అంతగా ఆహ్వానించదగినదిగా అనిపించదు.  మరి, మనం మరణాన్ని ఎలా చూడాలి?

మొదటిగా, అక్షరార్థంలో మరణం అంటే ఈ లోకం నుండి పరలోకానికి వెళ్లడం.  దేవుని చిత్తానికి అనుగుణంగా మన సమయం వచ్చినప్పుడు, మనం దానిని స్వాగతించి, దేవుని జీవంలో పూర్తిగా లీనమవడాన్ని ఆశతో ఎదురుచూడాలి.  

కానీ ఈ పవిత్ర గ్రంథ వాక్యభాగం మరో స్థాయిలో మరణం గురించి చెబుతుంది.  నేలలో పడి మరణించడం ద్వారానే తనలోని సామర్థ్యాన్ని పూర్తిగా సాకారం చేసుకునే గోధుమ గింజలో మనల్ని మనం చూసుకోవాలి.  ఆ సహజ ప్రక్రియలో అది సారవంతమైన నేలలో నాటబడి, పెరిగి, సమృద్ధిగా మంచి ఫలాలను ఇస్తుంది.

ఈ సహజ ప్రక్రియలో మనల్ని మనం ఎలా చూసుకోవాలి?  మన స్వార్థానికి మరణించడాన్ని స్వీకరించడం ద్వారా మనం అలా చేస్తాం; తద్వారా దేవుని కృప అనే సారవంతమైన నేలలో నాటబడి, సమృద్ధిగా మంచి ఫలాలను ఇవ్వగలం.

తనకు తాను మరణించడం అంటే జీవితంలోని స్వార్థాన్నంతటినీ విడిచిపెట్టడం.  మొదట ఉద్దేశపూర్వకంగా చేసే స్వార్థపూరిత కార్యాలన్నిటినీ విడిచిపెట్టాలి; ఆ తరువాత ఉద్దేశపూర్వకం కాని స్వార్థాన్ని కూడా విడిచిపెట్టాలి.  “ఉద్దేశపూర్వకం కాని స్వార్థం” అంటే ఏమిటి?

తెలియకుండానే ఉండే స్వార్థం అంటే, కేవలం మీకోసమే కావాలనే కారణంతో జీవితంలో మీరు పట్టుకొని వదలకుండా అంటిపెట్టుకునే ప్రతిదీ అని చెప్పవచ్చు.  ఇందులో ప్రేమపూర్వకమైన బంధం వంటి మంచి విషయాలు కూడా ఉండవచ్చు.  ప్రేమపూర్వకమైన బంధాల వంటి జీవితంలోని మంచి విషయాలను మనం తొలగించుకోవాలని కాదు; బదులుగా, స్వార్థపూరిత ఉద్దేశాలతో దేనినీ, మంచి విషయాలను సైతం, అంటిపెట్టుకోకూడదు.  దేవుని ప్రేరణతో కలిగే నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ అనాసక్తితో, నిస్వార్థంగా ఉంటుంది; అది ఎదుటివారి మేలును మాత్రమే కోరుకుంటుంది.  మన స్వార్థానికి మనం మరణిస్తూ జీవించగల అత్యంత నిర్మలమైన విధానం ఇదే.  సంపూర్ణమైన నిస్వార్థ అనాసక్తితో కూడిన ఈ స్థాయి ప్రేమను ఆచరించినప్పుడు, దేవుడు మన జీవితాల్లోకి, మన జీవితాల్లోని ప్రతి ప్రత్యేక పరిస్థితిలోకి ప్రవేశించి, సమృద్ధిగా మంచి ఫలాలను కలుగజేస్తాడు.  ఇది మనంతట మనం చేయగల దేనికన్నా శక్తిమంతమైన వరం. ఎందుకంటే, ఇది స్వార్థానికి సంపూర్ణంగా మరణించడం వల్ల కలిగే ఫలం; దేవుడు దానిని నూతన జీవంగా మారుస్తాడు.

ఈ రోజు, మరణించడానికి మీకున్న పిలుపును గురించి ధ్యానించండి.  మొదట, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు మీరు నిజంగా అనుభవించే మరణం గురించి ధ్యానించండి.  ఆ క్షణానికి భయపడకండి; బదులుగా, దానిని జీవపరిపూర్ణతలోకి ప్రవేశించే మహిమాన్వితమైన మార్పుగా చూడండి.  రెండవదిగా, ఇక్కడే, ఇప్పుడే మీ స్వార్థానికి మీరు మరణించగల మార్గాలను వెదకండి.  ఈ విధమైన మరణానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్న ఆచరణాత్మకమైన, నిర్దిష్టమైన మార్గాలను గుర్తించండి.  ఈ కార్యంలో నూతన జీవానికి సంబంధించిన మహిమాన్వితమైన వరాలు మీకోసం ఎదురుచూస్తున్నాయని తెలుసుకోండి.

తన్నుతాను బలిగా అర్పించుకున్న నా ప్రభువా, నన్ను నేను నీకూ నీ పవిత్ర చిత్తానికీ సంపూర్ణంగా, త్యాగపూర్వకంగా అర్పించుకుంటున్నాను.  ఈ నిస్వార్థ సమర్పణ ద్వారా నీవు నూతన జీవాన్ని కలుగజేసేలా, నా స్వార్థానికి నేను మరణించాలని ఎంచుకుంటున్నాను.  ప్రియ ప్రభువా, నన్ను స్వీకరించి, నీ చిత్తప్రకారం నన్ను మలచుకో.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


వయసుతో పాటు వచ్చే జ్ఞానం

తపస్సుకాలపు ఐదవ ఆదివారం (సంవత్సరం C)
(గమనిక: ఈ ఆదివారానికి సంవత్సరం A పఠనాలను ఉపయోగించినప్పుడు, కింది సువార్తను సోమవారం ఉపయోగించవచ్చు)

“మీలో పాపం లేనివారు ముందుగా ఆమెపై రాయి వేయండి.”  ఆయన మళ్లీ వంగి నేలమీద వ్రాశాడు.  అది విని, వయసులో పెద్దవారితో మొదలుపెట్టి, వారు ఒకరి తరువాత ఒకరు వెళ్లిపోయారు.  యోహాను 8:7–9

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపడాన్ని యేసు సమర్థిస్తాడో లేదో చూడటానికి ఆమెను ఆయన ముందుకు ఈడ్చుకువచ్చిన సంఘటనలోని భాగం ఇది.  ఆయన సమాధానం పరిపూర్ణమైనది. చివరికి, యేసు సున్నితమైన కరుణను అనుభవించడానికి ఆమె ఒక్కతే అక్కడ మిగిలిపోతుంది.

అయితే ఈ భాగంలో మన దృష్టి నుంచి సులభంగా తప్పిపోయే ఒక వాక్యం ఉంది.  అదే, “…వయసులో పెద్దవారితో మొదలుపెట్టి” అనే వాక్యం.  ఇది మానవ సమాజాల్లోని ఒక ఆసక్తికరమైన తీరును వెల్లడిస్తుంది.  సాధారణంగా చెప్పాలంటే, వయసుతో పాటు వచ్చే జ్ఞానం, అనుభవం చిన్నవారికి తక్కువగా ఉంటాయి.  యువత దానిని అంగీకరించడం కష్టంగా భావించినప్పటికీ, సుదీర్ఘ జీవితం గడిపినవారికి జీవితం పట్ల ప్రత్యేకమైన, విశాలమైన అవగాహన ఉంటుంది.  ఇది వారు తమ నిర్ణయాల్లోనూ తీర్పుల్లోనూ మరింత వివేకంతో వ్యవహరించేలా చేస్తుంది; ముఖ్యంగా జీవితంలో మరింత ఉద్విగ్నమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.

ఈ సంఘటనలో, ఆ స్త్రీపై కఠినమైన తీర్పుతో ఆమెను యేసు ముందుకు తీసుకువస్తారు.  భావోద్వేగాలు ఉద్ధృతంగా ఉన్నాయి; ఆమెను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నవారి హేతుబద్ధమైన ఆలోచనను ఈ భావోద్వేగాలు స్పష్టంగా మరుగుపరుస్తున్నాయి.  యేసు ఒక లోతైన మాటతో ఈ అవివేకాన్ని ఛేదిస్తాడు.  “మీలో పాపం లేనివారు ముందుగా ఆమెపై రాయి వేయండి.”  బహుశా, మొదట్లో చిన్నవారు లేదా మరింత భావోద్వేగానికి లోనైనవారు యేసు మాటలను మనసుకు పట్టించుకోలేదు.  వారు బహుశా చేతుల్లో రాళ్లతో, విసరడం మొదలుపెట్టడానికి ఎదురుచూస్తూ అక్కడ నిలబడి ఉండవచ్చు.  కానీ అప్పుడు వయసులో పెద్దవారు వెళ్లిపోవడం మొదలుపెట్టారు.  ఇక్కడ వయసూ జ్ఞానమూ తమ ప్రభావాన్ని చూపుతున్నాయి.  ఆ పరిస్థితిలోని భావోద్వేగానికి వారు తక్కువగా లోనయ్యారు; మన ప్రభువు పలికిన మాటల్లోని జ్ఞానాన్ని వెంటనే గుర్తించారు.  ఫలితంగా, మిగిలినవారు కూడా వారిని అనుసరించారు.

ఈ రోజు, వయసుతో పాటు వచ్చే జ్ఞానం గురించి ధ్యానించండి.  మీరు వయసులో పెద్దవారైతే, స్పష్టతతో, దృఢత్వంతో, ప్రేమతో యువతరానికి మార్గనిర్దేశం చేయడంలో తోడ్పడవలసిన మీ బాధ్యత గురించి ధ్యానించండి.  మీరు చిన్నవారైతే, పెద్దతరం వారి జ్ఞానంపై ఆధారపడటాన్ని నిర్లక్ష్యం చేయకండి.  వయసు జ్ఞానానికి పూర్తి హామీ కాకపోయినా, మీరు గ్రహించిన దానికన్నా అది ఎంతో ముఖ్యమైన అంశం కావచ్చు.  మీ పెద్దల మాటలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి, వారిని గౌరవించండి, వారు జీవితంలో పొందిన అనుభవాల నుంచి నేర్చుకోండి.

యువత కోసం ప్రార్థన: ప్రభువా, నా పెద్దల పట్ల నిజమైన గౌరవాన్ని నాకు దయచేయి.  వారు జీవితంలో పొందిన అనేక అనుభవాల నుంచి వచ్చిన వారి జ్ఞానానికి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  వారి సలహాను స్వీకరించడానికి నాకు సుముఖతను దయచేయి; వారి సున్నితమైన మార్గదర్శకత్వంలో నన్ను నడిపించు.

వృద్ధుల ప్రార్థన: ప్రభువా, నా జీవితానికీ, నాకు కలిగిన అనేక అనుభవాలకూ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కష్టాలు, పోరాటాల ద్వారా నాకు బోధించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జీవితంలో నాకు లభించిన ఆనందాలకూ, ప్రేమానుబంధాలకూ నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నీ బిడ్డలకు దారి చూపడంలో నేను తోడ్పడేలా నీ జ్ఞానాన్ని నాపై నిరంతరం కుమ్మరించు. మంచి ఆదర్శంగా ఉండటానికి, నీ హృదయానుసారం వారిని నడిపించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేసెదను గాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


యేసు “గడియ”

తపస్సుకాలం ఐదవ వారంలోని సోమవారం

అయితే ఆయన గడియ ఇంకా రాలేదు కాబట్టి ఎవరూ ఆయనను బంధించలేదు. యోహాను 8:20

యేసు మరోసారి పరిసయ్యులను నేరుగా ఎదుర్కొన్న తరువాత, నేటి సువార్త చివరలో ఈ చిన్న వాక్యం వస్తుంది. ఈ సందర్భంలో, తండ్రితో తనకున్న ఐక్యతను గురించిన సత్యాన్ని, ఈ ఐక్యత వల్ల తనకున్న శక్తిని, అధికారాన్ని గురించి చెబుతూ ఆయన వారిని ఎదుర్కొంటారు. పరిసయ్యులు ఆయనను ఎదిరించి సవాలు చేయడానికి ప్రయత్నిస్తారు; అయితే ఆయన స్పష్టమైన భాషలో సత్యాన్నే వారికి తిరిగి చెబుతారు. యేసు మాటలకు వారు ఎలా స్పందించారో నమోదు కాలేదు. అయినా ఏమి చెప్పాలో వారికి తెలియలేదని, వారు ఇంకా సందేహిస్తూనే యేసును ఉచ్చులో పడవేయాలని కోరుకుంటున్నారని స్పష్టమవుతుంది.

పైన పేర్కొన్న వాక్యం మనకు ఒక గంభీరమైన సత్యాన్ని వెల్లడిస్తుంది: యేసు “గడియ ఇంకా రాలేదు” కాబట్టి పరిసయ్యుల దురుద్దేశంగానీ, మరెవరి దురుద్దేశంగానీ అంతిమంగా విజయం సాధించలేవు. దీని అర్థమేమిటి? ఈ వాక్యం నుండి మనం గ్రహించవలసిన రెండు సత్యాలు ఇవి.

మొదటిది, దురుద్దేశం దేవుని చిత్తాన్ని ఓడించలేదు. ఆ సమయంలో యేసును బంధించడానికి తండ్రియైన దేవుడు అనుమతించలేదు కాబట్టి, చెడు ఉద్దేశాలు కలవారు అలా చేయలేకపోయారు. యేసు సత్యంతో పరిసయ్యులను సవాలు చేస్తూ స్పష్టంగా, బహిరంగంగా మాట్లాడగలిగారు; దానిని ఆపడానికి వారు ఏమీ చేయలేకపోయారు. ఆయన మాటలు వారి హృదయాలను గుచ్చినప్పటికీ, వారు ఆ మాటలను వింటూ మన ప్రభువు పట్ల మరింత కోపాన్ని, మొండితనాన్ని పెంచుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయారు. కానీ వారు ఆయనకు హాని చేయలేకపోయారు. ఇతరుల దురుద్దేశం కూడా అంతిమంగా దేవుని అధీనంలోనే ఉందని ఇది చూపిస్తుంది. అలాంటిది జరగడానికి అనుమతించడం ద్వారా మరింత గొప్ప ప్రయోజనం నెరవేరుతుందని ఆయన చూసినప్పుడే, దురుద్దేశం గెలిచినట్లు కనిపించడానికి ఆయన అనుమతిస్తారు.

రెండవది, యేసు పాపాత్ములైన మనుష్యులకు అప్పగించబడే “గడియ” రాబోతున్నదని ఇది వెల్లడిస్తుంది. అయితే యోహాను సువార్తలో ఈ గడియ యేసుకు సిగ్గు, అవమానాల గడియ కాదు; బదులుగా, అది పాపం, మరణాలపై సంపూర్ణ విజయాన్ని సాధించే గడియ. లోక దృష్టిలో చూస్తే, ఆయనను బంధించి, హింసించి, సిలువ వేసే గడియ అందరి ఎదుట యేసుకు భయానకమైనదిగా, అవమానకరమైనదిగా కనిపిస్తుందని మనకు తెలుసు. ఆయన ఓడిపోయి పరిసయ్యులు గెలిచినట్లు అనిపిస్తుంది. కానీ ఏకైక సత్యమైన దృక్పథమైన దేవుని దృష్టిలో, యేసు మహిమాన్వితంగా విజయం సాధిస్తారు. నిజానికి, ఈ గడియలో యేసు అనుభవించిన శ్రమల ద్వారా ఆయన మహిమపరచబడటానికి పరిసయ్యుల దురుద్దేశమే సాధనంగా మారేందుకు తండ్రి చివరికి అనుమతిస్తారు. దైవ దృష్టిలో, ఆయన గడియ ఓటమి గడియ కాదు; బదులుగా, అది అంతిమ విజయ గడియగా మారుతుంది.

రాబోతున్న యేసు గడియను గురించి నేడు ధ్యానించండి. త్వరలో మనం పవిత్ర వారపు మహిమల్లోకి ప్రవేశించి, ఊహించగలిగిన అత్యంత క్రూరమైన శ్రమలను, మరణాన్ని యేసు అనుభవించడానికి తండ్రి అనుమతించారనే విషయాన్ని మరోసారి ధ్యానిస్తాము. ఆయనను బంధించడం వల్ల కలిగినట్లు కనిపించే అపకీర్తిని, ఆనాటి దుర్బుద్ధిగల నాయకులు గెలిచారనే భ్రమను మనం ఎదుర్కొంటాము. అయితే వారి విజయం కేవలం భ్రమ మాత్రమే; ఎందుకంటే దానిని అనుమతించిన తండ్రి చిత్తంలో వేరే ఉద్దేశాలు ఉన్నాయి. యేసు గడియను ఏటా జరుపుకునే ఈ ఉత్సవానికి సిద్ధపడటం ప్రారంభించండి; అత్యంత దృఢనమ్మకంతో, విశ్వాసంతో అందులో ప్రవేశించండి.

మహిమాన్వితుడవైన నా ప్రభువా, నీ జ్ఞానాన్ని, శక్తిని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాను; పరలోకంలోని తండ్రి పరిపూర్ణ చిత్తంలో ఆనందిస్తున్నాను. విమోచన, రక్షణ కార్యం నిమిత్తం తండ్రి నిన్ను పంపి, చివరికి నీవు శ్రమలను అనుభవించి మరణించడానికి అనుమతించారు. అయితే ఈ శ్రమల ద్వారా ఆయన మరణంపైనా, సమస్త చెడుపైనా అంతిమ విజయాన్ని సాధించారు. ఈ సత్యాన్ని నా పూర్ణహృదయంతో తెలుసుకొని నమ్మడానికి నాకు విశ్వాసాన్ని దయచేయి. ప్రియమైన ప్రభువా, రాబోతున్న ఈ పవిత్ర వారాన్ని ఆశీర్వదించు; నీ మహిమాన్విత విజయంలో నేను ఆనందించేలా అనుగ్రహించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


దేవుని నిరంతర సాన్నిధ్యం

తపఃకాలం ఐదవ వారంలోని మంగళవారం

“నన్ను పంపినవారు నాతో ఉన్నారు. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు.” యోహాను 8:29

చాలామంది చిన్నపిల్లలను ఇంట్లో పూర్తిగా ఒంటరిగా వదిలేస్తే, వారు భయపడతారు. తమ తల్లిదండ్రులు దగ్గరలోనే ఉన్నారని వారికి తెలియాలి. ఎక్కడైనా పూర్తిగా ఒంటరిగా ఉండాలనే ఆలోచనే భయపెడుతుంది. దుకాణంలోనో, మరో బహిరంగ ప్రదేశంలోనో తప్పిపోవడం కూడా పిల్లలకు అంతే భయానకంగా ఉంటుంది. తల్లిగానీ తండ్రిగానీ దగ్గరగా ఉన్నప్పుడు కలిగే భద్రత వారికి అవసరం.

ఆధ్యాత్మిక జీవితంలోనూ ఇదే నిజం. మన అంతరంగంలో మనం పూర్తిగా ఒంటరిగా ఉన్నామని అనిపిస్తే, మనం భయపడవచ్చు. అంతరంగంలో దేవుడు మనలను విడిచిపెట్టినట్లు అనిపించడం భయానకమైన ఆలోచన. కానీ దీనికి విరుద్ధంగా, దేవుడు మనలో ఎంతో సన్నిహితంగా, సజీవంగా ఉన్నారని మనం గ్రహించినప్పుడు, ధైర్యంతో, ఆనందంతో జీవితాన్ని ఎదుర్కొనేందుకు మనకు ఎంతో బలం చేకూరుతుంది.

పైన పేర్కొన్న వాక్యభాగంలో యేసు తండ్రితో తనకున్న సంబంధం గురించి ఎంతో మాట్లాడుతున్నారు. అందులో ఆయన అనుభవం ఇదే. తనకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చడానికి యేసును లోకంలోకి పంపినవారు తండ్రే; తండ్రి తనను ఒంటరిగా విడిచిపెట్టరని యేసు అంగీకరిస్తున్నారు. యేసు ఈ మాట చెబుతున్నారు, ఈ విషయాన్ని తెలుసుకొని ఉన్నారు, తన మానవ, దైవ హృదయంలో ఆ సంబంధపు ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. 

మనలో ప్రతి ఒక్కరి గురించి కూడా ఇదే చెప్పవచ్చు. మొదటిగా, తండ్రి మనలను పంపారని మనం గ్రహించాలి. మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక కార్యం అప్పగించబడింది. మీరు దీనిని గ్రహిస్తున్నారా? దేవుడు మీకు ఎంతో నిర్దిష్టమైన కార్యాన్ని, పిలుపును ఇచ్చారని మీరు గ్రహిస్తున్నారా? అవును, అందులో ఇంటి పనులు, రోజువారీ ఉద్యోగ శ్రమ, కుటుంబ సంబంధాలను బలపరచుకోవడం వంటి జీవితంలోని అతి సాధారణమైన అంశాలు ఉండవచ్చు. దేవుని చిత్తంలో భాగమైన సాధారణ పనులతోనే మన దైనందిన జీవితాలు నిండి ఉన్నాయి.

మీ జీవితంపట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మీరు ఇప్పటికే పూర్తిగా నిమగ్నమై ఉండవచ్చు. అయితే దేవుడు మీ నుండి ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఉండవచ్చు. మీ కోసం ఆయనకు ఒక ప్రణాళిక ఉంది; అది ఆయన మరెవరికీ అప్పగించని కార్యం. దానికోసం మీరు విశ్వాసంతో ముందడుగు వేయవలసి రావచ్చు, ధైర్యంగా ఉండవలసి రావచ్చు, మీకు సౌకర్యంగా అనిపించే పరిధిని దాటి బయటకు రావలసి రావచ్చు, లేదా ఏదైనా భయాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. పరిస్థితి ఏదైనా సరే, దేవుడు మీకు ఒక కార్యాన్ని అప్పగించారు.

ఓదార్పునిచ్చే శుభవార్త ఏమిటంటే, దేవుడు మనలను పంపడమే కాదు, మనతోనే ఉంటారు కూడా. తాను మనకు అప్పగించిన కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన సహాయం నిరంతరం మనకు తోడుగా ఉంటుందని ఆయన ఎంతో ప్రధానమైన రీతిలో వాగ్దానం చేశారు.

యేసుకు అప్పగించబడిన కార్యం గురించి ఈ రోజు ధ్యానించండి: అది తన ప్రాణాన్ని బలిగా అర్పించే కార్యం. త్యాగపూరిత ప్రేమతో, ఆత్మార్పణతో కూడిన ఇదే కార్యాన్ని క్రీస్తుతో కలిసి మీరు ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారో కూడా ధ్యానించండి. మీరు ఇప్పటికే దానిని హృదయపూర్వకంగా జీవిస్తూ ఉండవచ్చు, లేదా మీకు ఏదైనా కొత్త దిశానిర్దేశం అవసరమై ఉండవచ్చు. ధైర్యంతో, నమ్మకంతో దానికి “అవును” అని చెప్పండి; అప్పుడు దేవుడు అడుగడుగునా మీతో నడుస్తారు.

తన్ను తాను బలిగా అర్పించుకున్న నా ప్రభువా, నా జీవితం కోసం నీవు సిద్ధం చేసిన పరిపూర్ణ ప్రణాళికకు నేను “అవును” అంటున్నాను. ప్రియమైన ప్రభువా, అది ఏదైనా సరే, నేను సంకోచం లేకుండా అంగీకరిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావనీ, నేను ఎన్నడూ ఒంటరిగా లేననీ నాకు తెలుసు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


పాపం నుండి విముక్తి

తపఃకాలం ఐదవ వారంలోని బుధవారం

యేసు వారికి ఇలా సమాధానమిచ్చారు: “ఆమేన్, ఆమేన్, నేను మీతో చెబుతున్నాను, పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిసలే. బానిస ఇంటిలో ఎప్పటికీ ఉండడు, కాని కుమారుడు ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని విముక్తులను చేస్తే, మీరు నిజంగా స్వతంత్రులవుతారు.”  యోహాను 8:34–36

యేసు మిమ్మల్ని విముక్తులను చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు విముక్తి పొందాలని కోరుకుంటున్నారా? ఆలోచనా స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సులభమే అయి ఉండాలి. తప్పకుండా మీరు మీ స్వేచ్ఛను కోరుకుంటారు! ఎవరు కోరుకోరు? అయితే ఆచరణలో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మరింత కష్టం. ఆచరణాత్మకంగా చూస్తే, చాలామంది పాపంలో జీవించడం ఎంతో సౌకర్యంగా భావిస్తారు. పాపం ఒక మోసపూరితమైన తృప్తిని అందిస్తుంది; దానిని విడిచిపెట్టడం కష్టంగా ఉండవచ్చు. దీర్ఘకాలంలో పాపం మీ స్వేచ్ఛను, ఆనందాన్ని హరించివేసినా, ఆ క్షణంలో మీకు మంచిగా “అనిపించేలా” చేయగలదు. అయితే చాలాసార్లు ఆ క్షణికమైన “తృప్తి” చాలు, అనేకమంది మళ్లీ మళ్లీ దాని వైపు తిరిగి వెళ్లడానికి.

మరి మీ సంగతి ఏమిటి? సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా లేదా కుమార్తెగా జీవించేందుకు మీరు స్వేచ్ఛను పొందాలనుకుంటున్నారా? మీ సమాధానం “అవును” అయితే, ఇది బాధాకరంగా ఉన్నా, ఆనందదాయకమైన రీతిలో ఉంటుందని గ్రహించి సిద్ధంగా ఉండండి. పాపాన్ని జయించడానికి శుద్ధీకరణ అవసరం. పాపాన్ని “విడిచిపెట్టే” ప్రక్రియకు నిజమైన త్యాగం, నిబద్ధత అవసరం. మీరు సంపూర్ణ నమ్మకంతో, ఆత్మసమర్పణతో ప్రభువు వైపు తిరగాలి. అలా చేయడంలో మీరు మీ స్వార్థానికి, మీ వాంఛలకు, మీ స్వార్థపూరిత చిత్తానికి ఒక విధంగా మరణించడాన్ని అనుభవిస్తారు. కనీసం పతనమైన మీ మానవ స్వభావం స్థాయిలోనైనా ఇది బాధ కలిగిస్తుంది. అయితే ఇది క్యాన్సరును లేదా ఏదైనా సంక్రమణను తొలగించే లక్ష్యంతో చేసే శస్త్రచికిత్స వంటిది. శస్త్రచికిత్స బాధ కలిగించవచ్చు, కానీ మీకున్న వ్యాధి నుండి విముక్తి పొందడానికి అదే ఏకైక మార్గం. కుమారుడే దైవ శస్త్రవైద్యుడు; తన సొంత శ్రమలు, మరణం ద్వారానే ఆయన మిమ్మల్ని విముక్తులను చేస్తారు. యేసు సిలువవేత, మరణం లోకానికి జీవాన్ని తెచ్చాయి. ఆయన మరణం పాపమనే వ్యాధిని నాశనం చేసింది. ఆయన మరణమనే ఔషధాన్ని మనం ఇష్టపూర్వకంగా స్వీకరించడం అంటే, ఆయన తన మరణం ద్వారా మనలోని పాపమనే వ్యాధిని నాశనం చేయడానికి మనం అనుమతించాలి. చెప్పాలంటే, మన ప్రభువు దానిని “కోసివేసి” తొలగించాలి.  

మిమ్మల్ని బంధించి ఉంచే వాటిని గుర్తించడానికి, మరే కాలం కంటే ఎక్కువగా మీ పాపంపై నిజాయితీగా దృష్టి పెట్టవలసిన కాలం తపస్సుకాలం. అలా చేస్తే దైవ వైద్యుడిని మీ గాయాలలోకి ప్రవేశించి మిమ్మల్ని స్వస్థపరచమని మీరు ఆహ్వానించగలుగుతారు. మీ మనస్సాక్షిని నిజాయితీగా, క్షుణ్ణంగా పరిశీలించుకోకుండా, మీ పాపాల నిమిత్తం పూర్ణహృదయంతో పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టకుండా తపస్సుకాలం గడిచిపోనివ్వకండి. మీరు స్వేచ్ఛను పొందాలని ప్రభువు కోరుకుంటున్నారు! మీరూ దానిని కోరుకోండి; మీ భారమైన బరువుల నుండి ఉపశమనం పొందేలా శుద్ధీకరణ ప్రక్రియలోకి ప్రవేశించండి.

ఈ రోజు, మీ వ్యక్తిగత పాపాల పట్ల మీ వైఖరిని ధ్యానించండి. మొదటిగా, మీ పాపాన్ని వినయంగా ఒప్పుకోగలరా? మీ పాపాలను సమర్థించుకోవద్దు, ఇతరులపై నింద మోపవద్దు. వాటిని ఎదుర్కొని, అవి మీ పాపాలేనని అంగీకరించండి. రెండవదిగా, మీ పాపాలను ఒప్పుకోండి. సయోధ్య సంస్కారం పట్ల మీ వైఖరిని ధ్యానించండి. ఇది స్వేచ్ఛను ప్రసాదించే సంస్కారం. ఇది ఎంతో సులభం. వెళ్లి, మీ పాపాలన్నిటినీ ఒప్పుకొని, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచి, విముక్తి పొందండి. ఇది మీకు కష్టంగా అనిపిస్తే, మీరు సత్యాన్ని కాకుండా మీలోని భయభావాలనే నమ్ముతున్నారన్నమాట. మూడవదిగా, దేవుని కుమారుడు మీకు అందించే స్వేచ్ఛలో ఆనందించండి. ఇది మన అర్హతలన్నిటికీ మించిన వరం. ఈ రోజూ, తపస్సుకాలంలో మిగిలిన రోజులన్నిటిలోనూ ఈ మూడు విషయాలను ధ్యానించండి. అప్పుడు మీ పాస్కా పండుగ నిజమైన కృతజ్ఞతతో నిండిపోతుంది!

ప్రభువా, నీ బిడ్డగా ఉండే స్వేచ్ఛలో నేను జీవించగలిగేలా సమస్త పాపాల నుండి విముక్తి పొందాలని నిజంగా కోరుకుంటున్నాను. ప్రియ ప్రభువా, నిజాయితీతో, దాపరికం లేకుండా నా పాపాన్ని ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయి. నీ శ్రమల ద్వారా, మరణం ద్వారా నీవు నాకు ప్రసాదించిన వాటన్నిటిలో నేను ఆనందించేలా, సయోధ్య సంస్కారంలో నా పాపాన్ని ఒప్పుకోవడానికి అవసరమైన ధైర్యాన్ని నాకు దయచేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


వినాశకరమైన మాటల శక్తి

తపఃకాలం ఐదవ వారంలోని గురువారం

యేసు యూదులతో ఇలా అన్నాడు: “ఆమేన్, ఆమేన్, నేను మీతో చెబుతున్నాను, నా వాక్యాన్ని పాటించేవారు ఎన్నటికీ మరణాన్ని చూడరు.” అప్పుడు యూదులు ఆయనతో, “నీకు దయ్యం పట్టిందని ఇప్పుడు మాకు నిశ్చయమైంది” అన్నారు. యోహాను 8:51–52

యేసు గురించి ఇంతకంటే దారుణంగా ఏమైనా అనగలరని ఊహించడం కష్టం. ఆయనకు దుష్టుడు పట్టాడని వారు నిజంగానే అనుకున్నారా? అలాగే అనిపిస్తోంది. దేవుని కుమారుని గురించి అలా అనడం ఎంత విచారకరం, ఎంత విపరీతం! ఇదిగో, దేవుడే స్వయంగా యేసు వ్యక్తిత్వంలో నిత్యజీవ వాగ్దానాన్ని అందిస్తున్నాడు. తన వాక్యానికి విధేయత చూపడమే నిత్యానందానికి మార్గమనే పవిత్ర సత్యాన్ని, ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించాలనే విషయాన్ని ఆయన వెల్లడిస్తున్నాడు. యేసు దీనిని స్వేచ్ఛగా, బహిరంగంగా చెబుతున్నాడు. అయితే ఈ సందేశాన్ని వింటున్న కొందరి ప్రతిస్పందన తీవ్ర నిరాశ కలిగించేదిగా, అపవాదులతో, దురుద్దేశంతో నిండినదిగా ఉంది.

వారు అలాంటి మాట అనడానికి వారి మనసుల్లో ఏమి జరుగుతోందో తెలుసుకోవడం కష్టం. బహుశా వారు యేసును చూసి అసూయపడి ఉండవచ్చు, లేదా వారు తీవ్రమైన అయోమయంలో ఉండి ఉండవచ్చు. ఏదేమైనా, వారు ఎంతో హాని కలిగించే మాట అన్నారు.

అలాంటి మాట వల్ల కలిగిన హాని ప్రధానంగా యేసుకు కాదు; బదులుగా, అది వారికీ, ఆయన చుట్టూ ఉన్నవారికీ హాని కలిగించింది. తన గురించి ఏమి మాట్లాడినా యేసు వ్యక్తిగతంగా తట్టుకోగలడు, కానీ ఇతరులు అలా తట్టుకోలేరు. మన మాటలు మనకూ, ఇతరులకూ ఎంతో హాని కలిగించగలవని అర్థం చేసుకోవడం ముఖ్యం.

మొదటిగా, వారి మాటలు వారికే హాని కలిగించాయి. అంత తప్పుడు మాటను బహిరంగంగా పలకడం ద్వారా, వారు మొండితనపు మార్గంలో నడవడం మొదలుపెడతారు. భవిష్యత్తులో అలాంటి మాటను వెనక్కి తీసుకోవడానికి ఎంతో వినయం అవసరం. మన విషయంలోనూ అంతే. మరొకరికి హాని కలిగించే మాట పలికినప్పుడు, దానిని వెనక్కి తీసుకోవడం కష్టం. ఆ తరువాత క్షమాపణ అడగడమూ, మనం కలిగించిన గాయాన్ని మాన్పడమూ కష్టం. ప్రధానంగా మన సొంత హృదయానికే హాని కలుగుతుంది; ఎందుకంటే మన తప్పును విడిచిపెట్టి వినయంగా ముందుకు సాగడం కష్టమవుతుంది. అయితే కలిగిన హానిని సరిదిద్దాలనుకుంటే, మనం ఇలా చేయక తప్పదు.

రెండవదిగా, ఈ వ్యాఖ్య వింటున్నవారికి కూడా హాని కలిగించింది. దురుద్దేశంతో పలికిన ఈ మాటను కొందరు తిరస్కరించి ఉండవచ్చు. కానీ మరికొందరు దాని గురించి ఆలోచించి, నిజంగానే యేసుకు దయ్యం పట్టిందేమో అని సందేహించడం మొదలుపెట్టి ఉండవచ్చు. ఈ విధంగా సందేహపు విత్తనాలు నాటబడ్డాయి. మన మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయని మనమందరం గ్రహించాలి. ఎంతో జాగ్రత్తతో, ప్రేమతో మాట్లాడటానికి కృషి చేయాలి.

ఈ రోజు, మీ మాటతీరును ధ్యానించండి. మీరు ఇతరులతో చెప్పిన విషయాల్లో ఏవైనా తప్పని లేదా తప్పుదారి పట్టించేవని ఇప్పుడు గ్రహిస్తున్నారా? అలా అయితే, మీ మాటలను వెనక్కి తీసుకొని, క్షమాపణ అడగడం ద్వారా కలిగిన హానిని సరిదిద్దడానికి ప్రయత్నించారా? అలాగే, ఇతరుల దురుద్దేశపూరిత సంభాషణల్లోకి ఆకర్షితులవడం సులభమనే విషయాన్ని కూడా ధ్యానించండి. అలాంటి సంభాషణలు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి అనుమతించారా? అలా అయితే, అటువంటి తప్పుడు మాటలకు చెవొగ్గకూడదని నిశ్చయించుకొని, సత్యాన్ని పలికే మార్గాలను వెదకండి.

సమస్త సత్యానికీ ప్రభువా, ఎల్లప్పుడూ నిన్ను మహిమపరచే, నీ హృదయంలో సజీవంగా ఉన్న నిత్య సత్యాలను ప్రతిబింబించే పవిత్రమైన మాటలను పలికే కృపను నాకు దయచేయి. ఈ పాపపు లోకంలో నా చుట్టూ ఉన్న అబద్ధాలను కూడా గుర్తించడానికి నాకు సహాయం చేయి. నీ హృదయం తప్పుడు విషయాలను వడపోసి తొలగించి, నా మనసులోనూ హృదయంలోనూ సత్యపు విత్తనాలు మాత్రమే నాటబడేలా చేయుగాక. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


సిలువారోహణం సమీపిస్తోంది

తపఃకాలం ఐదవ వారంలోని శుక్రవారం

యేసును రాళ్లతో కొట్టడానికి యూదులు రాళ్లు ఎత్తుకున్నారు. యేసు వారితో, “నా తండ్రి నుండి అనేక సత్కార్యాలను మీకు చూపించాను. వీటిలో ఏ కార్యం కోసం నన్ను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు?” అని అడిగాడు. యోహాను 10:31–32

మనం పవిత్ర వారానికి, శుభ శుక్రవారానికి దగ్గరవుతున్నకొద్దీ, యేసు పట్ల ద్వేషం పెరుగుతూ ఉండటాన్ని గమనించడం మొదలుపెడతాం. నిన్నటి ధ్యానంలో చూసినట్లే, దీనిలో ఏమాత్రం అర్థం లేదు. యేసును ద్వేషించడం, ఆయనను రాళ్లతో కొట్టి చంపాలని కోరుకోవడం పూర్తిగా వివేకరహితమైన చర్య. అయినా, జరిగింది ఇదే. యేసును వ్యతిరేకించినవారి తెగింపు క్రమక్రమంగా పెరిగింది. చివరకు, ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించి, స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వీకరించిన ఆ నిర్ణాయక దినం వచ్చింది.

రాబోయే రెండు వారాల్లో ఈ వివేకరాహిత్యాన్ని, హింసను నేరుగా ఎదుర్కోవడం మంచిది. ఎంతోమందిలోని ద్వేషాన్ని చూసి, అది నిజంగా ఏమిటో గుర్తించి స్పష్టంగా చెప్పడం మంచిది. కాదు, అది సంతోషాన్ని కలిగించే ఆలోచన కాదు; కానీ అది వాస్తవం. మనం జీవిస్తున్న ప్రపంచం ఇలాంటిదే. మన జీవితాల్లో మనమందరం ఎదుర్కోబోయే వాస్తవం కూడా ఇదే.

చెడును, హింసను ఎదుర్కొనేటప్పుడు మనం యేసులాగే వ్యవహరించాలి. ఆయన వాటిని భయం లేకుండా ఎదుర్కొన్నారు. ఆయన సత్యంతో వాటిని ఎదుర్కొన్నారు; ఎంతోమంది తనపై మోపిన అబద్ధాలను, అపనిందలను ఎన్నడూ అంగీకరించలేదు.

వాస్తవం ఏమిటంటే, మనం దేవునికి ఎంత దగ్గరవుతామో, అంత ఎక్కువ హింసను, ద్వేషాన్ని ఎదుర్కొంటాం. మళ్ళీ, ఇది మనకు అర్థవంతంగా అనిపించకపోవచ్చు. మనం దేవునికి దగ్గరగా ఉండి, పవిత్రత కోసం కృషిచేస్తే అందరూ మనల్ని ప్రేమిస్తారని, ప్రశంసిస్తారని అనుకోవడం సులభం. కానీ యేసు విషయంలో అలా జరగలేదు; మన విషయంలోనూ అలా జరగదు.

హింస, బాధ, కష్టాలు, దుఃఖం మధ్య సత్యంలో స్థిరంగా నిలవడం పవిత్రతకు ఒక కీలక మార్గం. పరిస్థితులు మనం కోరుకున్నట్లు సాగనప్పుడు, మనం తప్పకుండా ఏదో తప్పు చేస్తున్నామనే ఆలోచనకు లోనయ్యే శోధన ఎప్పుడూ ఉంటుంది. మంచితనానికి, సత్యానికి అండగా నిలవడానికి మనం ప్రయత్నించినప్పుడు, లోకం మనపై మోపే అబద్ధాల వల్ల, అపనిందల వల్ల అయోమయానికి లోనవడం సులభం. మన సొంత సిలువల మధ్య దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటుంది: మన విశ్వాసాన్ని శుద్ధి చేసుకోవడం, ఆయన వాక్యంలోను సత్యంలోను స్థిరంగా నిలవాలని దృఢంగా నిర్ణయించుకోవడం.

మనం ఏదైనా సిలువను లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు, అది తలపై దెబ్బ తగిలినట్లుగా అనిపించవచ్చు. మనకు దిక్కుతోచనట్లుగా అనిపించవచ్చు; ఆందోళనకు, భయానికి లోనుకావచ్చు. కానీ మరే సమయంకన్నా ఎక్కువగా మనం దృఢంగా నిలవాల్సింది ఇలాంటి సమయాల్లోనే. మనం వినయంతో ఉంటూనే, దేవుడు మనకు చెప్పిన, వెల్లడించిన ప్రతిదాని పట్ల లోతైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఇది అన్ని విషయాల్లోనూ దేవునిపై నమ్మకం ఉంచే మన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. జీవితం సులభంగా ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉందని చెప్పడం సులభమే; మనం మోయాల్సిన సిలువ ఎంతో బరువుగా ఉన్నప్పుడు ఆయనపై నమ్మకం ఉంచడం కష్టం.

మీ సిలువ ఏదైనా సరే, ఏదో మరింత గొప్ప ఉద్దేశం కోసం మిమ్మల్ని బలపరచాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి, అది ఆయన ఇచ్చే వరమనే విషయాన్ని ఈ రోజు ధ్యానించండి. మహనీయుడైన పునీత రెండవ జాన్ పాల్ తన పాపుగారి సేవాకాలంలో పదేపదే చెప్పినట్లుగా, “భయపడకండి!” మీ భయాలను ఎదుర్కోండి; వాటి మధ్య దేవుడు మిమ్మల్ని రూపాంతరం చెందించనివ్వండి. మీరు అలా చేస్తే, జీవితంలో మీ అతి పెద్ద పోరాటాలే నిజానికి మీ అతి గొప్ప దీవెనలుగా మారడాన్ని తెలుసుకుంటారు.

ధైర్యశాలియైన నా ప్రభువా, నీ శ్రమలను, మరణాన్ని స్మరించుకునే దినాలకు మేము సమీపిస్తున్న ఈ సమయంలో, నా సిలువలను నీ సిలువతో కలపడానికి నాకు సహాయం చేయుము. నా అనుదిన పోరాటంలో నీ సాన్నిధ్యాన్ని, బలాన్ని చూడటానికి నాకు సహాయం చేయుము. ఈ సవాళ్ల మధ్య నా పట్ల నీకున్న ఉద్దేశాన్ని చూడటానికి నాకు సహాయం చేయుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.


ఒక్క మనిషి మరణించాలి

తపఃకాలం ఐదవ వారంలోని శనివారం

అయితే వారిలో ఒకడైన కయఫా, ఆ సంవత్సరపు ప్రధాన యాజకుడు, వారితో ఇలా అన్నాడు: “మీకు ఏమీ తెలియదు. జాతి అంతా నశించకుండా ఉండేందుకు, ప్రజలకు బదులుగా ఒక్క మనిషి మరణించడం మీకు మేలని కూడా మీరు ఆలోచించడం లేదు.” యోహాను 11:49–50

మునుపటి రోజు ధ్యానంలో వలెనే, యేసు శ్రమలపై, మరణంపై మన దృష్టిని కేంద్రీకరించడం ప్రారంభించడం ముఖ్యం. ఈ ఆదివారం పవిత్ర వారం ప్రారంభమవుతుంది. కాబట్టి, మనం తన సిలువను శ్రద్ధగా చూడాలని దేవుడు కోరుకునే సమయం ఇది. దానిని అన్ని కోణాల నుంచి చూడటం ముఖ్యం. ఏమి జరుగుతూ ఉండిందో, యేసు ఏమి అనుభవిస్తున్నారో, శిష్యులు ఏమి అనుభవిస్తున్నారో, చివరికి పరిసయ్యులు, ప్రధాన యాజకులు కూడా ఏమి అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం.

పైన పేర్కొన్న నేటి సువార్తలో ప్రధాన యాజకుడైన కయఫా ఆలోచనా విధానాన్ని చూస్తాం. అతని మాటలు ఒకేసారి విచారకరంగానూ ప్రవచనాత్మకంగానూ ఉండటం ఆసక్తికరం. అతడు ఇతర ప్రధాన యాజకులతోను పరిసయ్యులతోను కలిసి యేసు మరణానికి పథకాలు వేయడం, కుట్రలు పన్నడం ప్రారంభించాడు. అయితే కయఫాను, ఇతరులను అలా చేయడానికి ప్రేరేపించినట్లు కనిపించే కారణాన్ని గమనించడం మనకు లోతైన అవగాహనను ఇస్తుంది.

యేసుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఈ ప్రజాదరణ వల్ల రోమీయులతో కలతలు తలెత్తుతాయని వారు భయపడ్డారు. యేసు ఇంతమందిని ఆకర్షించాడని వారు ఈర్ష్య కూడా పడ్డారు. అందుకే ప్రజలందరూ నశించడం కంటే ఒక్క మనిషి చనిపోవడమే మేలనే వక్రతర్కాన్ని కయఫా ముందుకు తెచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే, యేసుకు ప్రజాదరణ పెరుగుతోంది కాబట్టి, ప్రజలు ప్రధాన యాజకులు, పరిసయ్యుల మాటలకంటే యేసు మాటలనే ఎక్కువగా వింటున్నారు కాబట్టి, ఆ “సమస్యను” తొలగిస్తే పరిస్థితులు మునుపటిలా మారిపోతాయని అతడు భావించినట్లు కనిపిస్తోంది.

పరిసయ్యులు సత్యం కంటే తమ గురించి, తమ స్థానం గురించే ఎక్కువ శ్రద్ధ చూపించారనే విషయాన్ని ఇది వెల్లడిస్తుంది. యేసు ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు చేస్తున్నాడనేది ఆయనపై వారు చేసిన విమర్శల్లో ఒకటి కావడం ఆశ్చర్యకరం. ఎంత విచిత్రం! ప్రధాన యాజకులు, పరిసయ్యులు సత్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే, వారు యేసు మహిమను, దైవిక అధికారాన్ని కూడా గుర్తించి, ఆయనను విశ్వసించి, ఆయనను అనుసరించి ఉండేవారు. కానీ వారు తమ గర్వాన్ని అణచుకొని, తమను తాము కాక మరొకరిని అనుసరించాలనే పిలుపును అంగీకరించలేకపోయారు. తమ అధికార స్థానాన్ని వదులుకోలేకపోయారు.

మన దైనందిన జీవితాల్లోనూ ఇదే అనుభవాన్ని తరచుగా చూస్తుంటాము. అందరి దృష్టి మనపైనే ఉండాలని కోరుకుంటాము. అందువల్ల, వేరొకరు రాణించడం లేదా ప్రశంసలు పొందడం చూసినప్పుడు మనకు తరచుగా ఈర్ష్య కలగవచ్చు. మన ఈర్ష్య తరచుగా అసూయగా మారవచ్చు. అసూయ అంటే మరొకరిలోని మంచిని చూసి మనకు కోపం, విచారం కలగడం. దాని గురించే మనసులో మథనపడుతూ, వారు విఫలం కావాలని కోరుకోవచ్చు.

యేసును నమ్మకంగా అనుసరించేవారిలో ఒకరిగా ఉండటమే మన ఆదర్శం కావాలి. రాబోయే ఈ వారంలో మన ప్రభువు పట్ల శత్రుత్వం పెరగడాన్ని మీరు చూస్తున్నప్పుడు, ఈ విషయాన్ని ధ్యానించడం ఎంతో ముఖ్యం. మీరు అక్కడ ఉండి ఉంటే ఏమి చేసేవారు? ఇతరుల దాడులు ఎదురైనా యేసుకు అండగా నిలబడుతూనే ఉండేవారా? యేసు పట్ల శత్రుత్వం పెరిగేకొద్దీ, మీరు ఆయన నుంచి వెనక్కి తగ్గేవారా, లేక ప్రేమతో, నిబద్ధతతో ఆయనకు మరింత దగ్గరయ్యేవారా?

త్వరలో మన ప్రభువు అనుభవించిన హింసలను స్మరించుకోబోతున్న సందర్భం గురించి ఈ రోజు ధ్యానించండి. ఆ మొదటి పవిత్ర వారంలో ప్రజలకు కలిగిన ఎన్నో ప్రతిస్పందనలను, అనుభవాలను మీ మనసులో ధ్యానించడం ప్రారంభించండి. వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకొని, యేసుతో కలిసి ఆ అనుభవాన్ని జీవించడానికి ప్రయత్నించండి. మహా శుక్రవారం నాడు ప్రేమతో, ధైర్యంతో ఆయన సిలువ పాదాల వద్ద ఉండి, ఆయనకు అండగా నిలుస్తూ, అడుగడుగునా ఆయనను ప్రేమించడమే మన లక్ష్యం.

హింసలకు గురైన నా ప్రభువా, రాబోయే ఈ పవిత్ర వారంలో నిన్ను అనుసరించే అనుగ్రహం నాకు ప్రసాదించు. నీవు తిరస్కారాన్ని, బాధను అనుభవిస్తున్నప్పుడు కూడా నిన్ను ప్రేమించడానికి అవసరమైన ప్రేమను నాకు దయచేయి. అసూయను, స్వార్థాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి, ముఖ్యంగా ఇతరుల బాధల్లోనూ, వారిలోని మంచితనంలోనూ నిన్ను చూడటానికి నాకు సహాయం చేయి. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పవిత్ర వారం

విషయ సూచిక


మృదుబంధ పుస్తకం & ఈ-పుస్తక రూపాల్లో కూడా లభ్యం