ప్ర. నేను ఒక కతోలిక యువకుణ్ణి. కతోలికురాలు కాని ఒక యువతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే, ఆమె తల్లిదండ్రులు తమ సమ్మతి కావాలంటే తమ దేవాలయంలోనే వివాహం జరగాలని పట్టుబడుతున్నారు. ముందుగా వారి దేవాలయంలో వివాహం చేసుకుని, ఆ తరువాత ఆమె జ్ఞానస్నానం, దివ్యసత్ప్రసాదం, స్థైర్యలేపనం అనే దివ్యసంస్కారాలను స్వీకరించినప్పుడు, మళ్లీ కతోలిక దేవాలయానికి వచ్చి మరోసారి వివాహం చేసుకోవడం సమ్మతమేనా? ఈ యువతి కతోలిక విశ్వాస బోధనల విషయంలో నాతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంది, కానీ తన తల్లిదండ్రులను బాధపెట్టాలని కోరుకోవడం లేదు. దయచేసి సలహా ఇవ్వండి.
జ. మీ ఉద్దేశాలు సరైన దిశలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది; మీ ఆలోచనను మరింత మెరుగుపరచుకోవడానికి కొన్ని సూచనలు మాత్రమే ఇస్తున్నాను.
ముందుగా, మీ వివాహానికి ఆశీర్వాదం లభించాలని, సరైనది చేయాలని మీరు కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. కతోలికుల విషయంలో, వివాహ ప్రమాణాలను కతోలిక సభ స్వీకరించడం అత్యావశ్యకం. అయితే, ఇది వివిధ విధాలుగా జరగవచ్చు. కతోలిక దేవాలయంలో గురువు లేదా డీకను సమక్షంలో మీ వివాహం జరుపుకోవడం ఆదర్శవంతమైన పద్ధతి. అయితే, కతోలిక సభ ఆమోదంతో మరో దేవాలయంలో (కతోలికేతర దేవాలయంలో) మీ వివాహం జరుపుకోవడానికి అనుమతి ఉంది. ఈ సందర్భంలో కూడా మీరు గురువును కలిసి, సాధారణంగా అవసరమయ్యే వివాహ సన్నాహాలన్నిటినీ పూర్తి చేయాలి. ఆ తరువాత, “సభా చట్టబద్ధ వివాహ విధానం” అని పిలిచే నియమాన్ని పాటించవలసిన బాధ్యత నుంచి మీకు మినహాయింపు ఇవ్వాలని గురువు బిషప్పుగారిని కోరతారు. ప్రత్యేక మినహాయింపు మంజూరు చేయబడుతుంది; మీ వివాహాన్ని మన సభ పూర్తిగా అంగీకరిస్తుంది. కాబట్టి ముందుగా మీరు చేయవలసింది, ఈ విషయం గురించి మీ విచారణ గురువుతో మాట్లాడి, ఇది సాధ్యమవుతుందేమో తెలుసుకోవడం.
అయితే, ముందుగా కతోలికేతర దేవాలయంలో (సభా చట్టబద్ధ వివాహ విధానం నుంచి మినహాయింపు పొందకుండా) వివాహం చేసుకుని, ఆ తరువాత మళ్లీ కతోలిక దేవాలయంలో వివాహం చేసుకోవడం మంచి ఆలోచన కాదు. ఇలా జరుగుతున్నప్పటికీ, ముందుగానే ఈ విధంగా ప్రణాళిక వేసుకోకపోవడం మంచిది. వేరొక వివాహ వేడుక ద్వారా ఇప్పటికే చట్టపరంగా బంధాన్ని ఏర్పరచిన మీ వివాహానికి కతోలిక సభలో చెల్లుబాటు కల్పించడానికే, ఆ తరువాత సభలో మీ వివాహాన్ని స్వీకరించే ప్రక్రియ నిర్వహించబడుతుంది. కతోలిక సభ వెలుపల వివాహం చేసుకున్నవారు ఇలా చేయాలని గట్టిగా సిఫారసు చేయబడుతున్నప్పటికీ, మొదటి నుంచే ఈ విధంగా ప్రణాళిక వేసుకోవడం మంచిది కాదు. మీరు నిజంగా ఎప్పుడు వివాహితులయ్యారనే విషయంలో ఇది గందరగోళాన్ని కలిగిస్తుంది. రెండు వివాహ వేడుకలు జరుపుకోవడం మంచిది కాదు.
ఆమె తల్లిదండ్రుల గురించి మీకున్న ఆందోళన సమంజసమైనదే. వారి ఆశీర్వాదంతో మీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు వారిని గౌరవించడం, ఆదరించడం ముఖ్యం. అయితే, మీ విశ్వాసం కంటే వారికి ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది కూడా ముఖ్యం. పైన పేర్కొన్న మొదటి సూచనను మీరు పాటించగలిగితే, అంతా సవ్యంగా జరగాలి. అయితే, సభా చట్టం నిర్దేశించిన వివాహ విధానం నుంచి మినహాయింపు పొందడం సాధ్యం కాకపోతే, సమస్యలు తలెత్తినా సరే, కతోలిక సభలోనే మీ వివాహం జరిగేలా ప్రయత్నించడం మేలు. మళ్లీ చెబుతున్నాను, ఈ నిర్ణయంలో మీ కతోలిక విశ్వాసమే అత్యంత ముఖ్యమైనది. మొదటి నుంచే మీ విశ్వాసం విషయంలో రాజీ పడటం సమస్యలకు దారితీస్తుంది. వివాహ వేడుక కుటుంబమంతటికీ ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఇలా చేయడం కష్టమే. అయినా, మీ విశ్వాసాన్ని రెండో స్థానంలో ఉంచకూడదు.
అన్నిటికంటే ముఖ్యంగా, ఈ విషయం గురించి ఎంతో పట్టుదలతో ప్రార్థించండి, దీని గురించి మాట్లాడుకోవడానికి తగినంత సమయం కేటాయించండి. ఓపికగా ఉండండి, సరైన పద్ధతిలో చేయడంపైనే దృష్టి నిలపండి. అలా చేసినందుకు మీరు కృతజ్ఞతతో ఉంటారు!
మరిన్ని కతోలిక ప్రశ్నలు & సమాధానాలు
