ప్రధాన చిత్రం: ఎల్ఏ మహాధర్మపీఠం, x.com ద్వారా
ప్రత్యేక చిత్రం: పబ్లిక్ డొమైన్, వికీపీడియా ద్వారా
అత్యంత దయామయుడవైన దేవా,
“మా ఆశ్రయముగా, మా బలముగా, ఆపదలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సహాయముగా” ఉండుము (కీర్తన 46:1).
నీవు మమ్మల్ని సృష్టించి, నీ సర్వశక్తితో మమ్మల్ని పోషిస్తున్నావు.
నీ కరుణకు హద్దులు లేవు.
ఈ తీవ్రమైన బాధా సమయంలో, కార్చిచ్చుల బాధితులందరినీ నీకు అప్పగిస్తున్నాము.
వారిని ఓదార్చుము, నీ కృపతో వారిని నింపుము, వారి అవసరాలను తీర్చుము.
మరణించిన వారందరినీ నీ దయామయ హృదయానికి అప్పగిస్తున్నాము.
వారి పాపాలనుండి వారిని శుద్ధిచేసి, నీ పరలోక రాజ్యంలోకి వారిని ఆహ్వానించుము.
ఈ విపత్తును ఎదుర్కొనే చర్యలను నిర్వహిస్తున్నవారికి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించుము.
ముందుండి పోరాడుతున్నవారికి ధైర్యాన్ని, దృఢసంకల్పాన్ని ప్రసాదించుము.
వారిని సురక్షితంగా ఉంచి, వారి ప్రయత్నాలు సఫలమయ్యేలా చేయుము.
ప్రభూ, నీవు ఒకప్పుడు తుఫానుతో అల్లకల్లోలమైన సముద్రాలను శాంతపరచినట్లే, గాలులను, మంటలను నీకు విధేయంగా ఉండమని ఆజ్ఞాపించుము.
వినాశనం కలిగిస్తున్న ఈ మంటలపై నీ కృపాజలాన్ని కుమ్మరించుము.
నీ శక్తిమంతమైన హస్తంతో వాటిని అరికట్టుము.
దేవుని దూతలారా, దేవుని కరుణ అత్యంత అవసరమైనవారికి తోడ్పడుటకు రండి.
వారిని రక్షించండి, నడిపించండి, దేవుని పవిత్ర చిత్తాన్ని వారికి తెలియజేయండి.
అగ్నిమాపక సిబ్బందికి పాలక పునీతుడవైన పునీత ఫ్లోరియన్, మంటలతో ధైర్యంగా పోరాడుతున్నవారి కోసం ప్రార్థించుము.
ప్రధాన దేవదూతవైన పునీత మిఖాయేలు, వారు ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని కాపాడుము.
పరలోకంలోని పునీతులారా, మీ ప్రార్థనను వేడుకుంటున్నాము. అత్యంత అవసరంలో ఉన్నవారి కోసం మధ్యవర్తిత్వ ప్రార్థన చేయండి.
ఈ విషాదం నుండి, కల్లోలం నుండి నిరీక్షణను, శాంతిని కలిగించుము.
దుఃఖాన్ని కనికరంగా మార్చుము.
అయోమయాన్ని విశ్వాసంగా మార్చుము.
నిరాశను దైవిక నిరీక్షణగా మార్చుము.
అత్యంత దయామయుడవైన దేవా, మా నమ్మకమంతటినీ నీపై ఉంచుతున్నాము,
ఈ కష్టపరీక్ష బూడిద నుండి నీవు నూతన జీవాన్ని, స్వస్థతను కలిగిస్తావని ఎరిగి ఉన్నాము.
ఇప్పుడూ ఎల్లప్పుడూ నీ నామం మహిమపరచబడును గాక.
ఆమెన్.
