తెలుగు

పన్నెండవ రోజు – పంచుకున్న బాధ


వీడియో రూపం

జ్ఞానులు తనను మోసగించారని గ్రహించిన హేరోదు తీవ్రంగా మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలాన్ని బట్టి, బేత్లెహేములోను దాని పరిసర ప్రాంతాలలోను రెండు సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. మత్తయి 2:16

హేరోదు ఆగ్రహం గురించి మరియ తల్లికి బాగా తెలుసు. తన సొంత కుమారుని కారణంగా లెక్కలేనంతమంది అమాయక శిశువులు మరణించారని ఆమెకు తెలుసు. యేసును కాపాడటానికి ఆమె, పునీత యోసేపు ఐగుప్తుకు పారిపోయారు. హేరోదుకు ఈ విషయం తెలిసినప్పుడు, ఆ అమూల్యమైన శిశువులందరినీ చంపమని ఆజ్ఞలు జారీ చేశాడు.

కొందరు చేయగలిగే దుష్టకృత్యాలు మనలను దిగ్భ్రాంతికి గురిచేసి, కలవరపెడతాయి. హేరోదు అలాంటి పని ఎలా చేయగలిగాడు? మరియ సొంత కుమారుడైన యేసు కారణంగా అలా ఎలా చేయగలిగాడు? తన జీవితమూ, తన కుమారుని జీవితమూ బాధలతో, వేదనతో నిండి ఉంటాయనడానికి ఈ మారణకాండ ఆమెకు కనిపించిన మొదటి స్పష్టమైన సూచన.

అయితే, ఆ పవిత్ర శిశువుల వేదసాక్షి మరణం మనలను కేవలం దిగ్భ్రాంతిలోను దుఃఖంలోను మిగిల్చకూడదు. మనం వారి బాధలను దాటి, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని చూడాలి. వారు దేవుని కుమారుని కారణంగా బాధపడ్డారు. వారు నిజమైన అర్థంలో వేదసాక్షులు.

బాధలను సంపూర్ణంగా స్వీకరించడం ఒక పవిత్రమైన పిలుపు అని ఆ అమాయక శిశువుల బాధలు మనకు నేర్పాలి. మన తప్పేమీ లేకుండానే బాధపడుతున్నప్పుడు ఇది మరింత వర్తిస్తుంది. ఇతరుల దుర్బుద్ధిని ఎదుర్కొన్నప్పుడు, మనకు జరిగిన అన్యాయాన్ని ప్రకటిస్తూ, తరచూ మనం ఎదురుతిరిగి, కోపంతో తిరుగుబాటు చేయడానికి మొగ్గుచూపుతాము. కానీ ఈ అమాయక వేదసాక్షులు అలా చేయలేదు.

ఎన్నో సంవత్సరాల తరువాత, మరియ తల్లి తన కుమారుని సిలువ ఎదుట నిలిచినప్పుడు, ఆయన వేదసాక్షి మరణాన్ని సంపూర్ణంగా, ఇష్టపూర్వకంగా స్వీకరించారని ఆమెకు తెలిసే ఉండి ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన ఏ మరణం నుండి కాపాడబడ్డారో, అది ఇప్పుడు నెరవేరుతోంది. తన కుమారుడు సిలువపై స్వేచ్ఛగా స్వీకరించిన బలియర్పణను ధ్యానిస్తూ, ఎంతోకాలం క్రితం మరణించిన ఆ అమాయక శిశువుల గురించి కూడా ఆమె ధ్యానించి ఉంటుంది.

క్రీస్తుకు సాక్ష్యమివ్వడానికి మీరు పిలువబడ్డారనే, స్వీకరించడం కష్టమైన సత్యాన్ని గురించి ఈ రోజు ధ్యానించండి. జీవితంలో మీరు అన్యాయంగా అనుభవించే ప్రతి విధమైన బాధను స్వీకరించడం ద్వారా సాక్ష్యమివ్వడానికి మీరు పిలువబడ్డారు. కోపం లేకుండా, ప్రతిఘటన లేకుండా, స్వేచ్ఛగా దానిని స్వీకరించడానికి మీరు పిలువబడ్డారు. మన ప్రభువు మిమ్మల్ని ఏ విధమైన వేదసాక్ష్యాన్ని స్వీకరించమని పిలుస్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తూ, అంత మహిమాన్వితమైన సాక్ష్యంలో పాలుపంచుకోవడానికి మీరు అర్హులుగా ఎంచబడినందుకు ఆనందించండి.

అత్యంత ప్రియమైన తల్లీ, నీ మనోబలం మహిమాన్వితమైనది. నీ జీవితంలో నీవు ఎంతో క్రూరత్వాన్ని చూశావు, అయినా విశ్వాసంలో ఎన్నడూ చలించలేదు. నీ వేదసాక్ష్యం ఆత్మలో అనుభవించిన వేదసాక్ష్యం; అది నీ అచంచలమైన ప్రేమకు ఫలితం.

ప్రియమైన తల్లీ, నా చుట్టూ ఉన్న లోకంలోని చెడును చూసినప్పుడు నేను ఎన్నడూ కోపానికిగానీ నిరాశకుగానీ లొంగిపోకుండా నాకు సహాయం చేయి. నీ మాతృసహజమైన మధ్యస్థ ప్రార్థనపై ఎల్లప్పుడూ నమ్మకముంచి, విశ్వాసంలోనూ నిరీక్షణలోనూ స్థిరంగా నిలిచి ఉండేందుకు నాకు సహాయం చేయి.

ప్రియమైన ప్రభువా, ఈ లోకంలో నీ సాన్నిధ్యం కారణంగా అమాయకులు బాధలు అనుభవించడానికి నీవు అనుమతించావు. నేను బాధలు అనుభవించడానికి నీవు అనుమతించినప్పుడు, ఈ వేదసాక్ష్యాలను నమ్మకంతోనూ నిరీక్షణతోనూ స్వీకరించడానికి నాకు అవసరమైన బలాన్ని, కృపను దయచేయి. నీ మహిమాన్వితమైన ఆదర్శాన్ని, ఆ పవిత్ర అమాయకుల ఆదర్శాన్ని నేను అనుసరించుదును గాక. 

మరియమాతా, నా కొరకు ప్రార్థించుము. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

పదమూడవ రోజు – ఒక తల్లి మననాలు

విషయ సూచిక

ఈ-పుస్తకంగా & పేపర్‌బ్యాక్‌గా లభిస్తుంది!