తెలుగు

ఇరవై ఆరవ రోజు – పుణ్యస్త్రీలు మరియు వెరోనికా


వీడియో రూపం

పెద్ద జనసమూహం యేసును అనుసరించింది. వారిలో ఆయన కోసం విలపిస్తూ రోదిస్తున్న అనేకమంది స్త్రీలు కూడా ఉన్నారు. యేసు వారివైపు తిరిగి ఇలా అన్నారు: “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే, ‘సంతానం లేనివారు, ఎన్నడూ కనని గర్భాలు, ఎన్నడూ పాలివ్వని వక్షోజాలు ధన్యమైనవి’ అని ప్రజలు చెప్పే రోజులు రాబోతున్నాయి. ఆ సమయంలో ప్రజలు కొండలతో, ‘మా మీద పడండి!’ అనీ, గుట్టలతో, ‘మమ్మల్ని కప్పివేయండి!’ అనీ అంటారు. పచ్చని చెట్టుకే ఇలా చేస్తే, ఎండిన చెట్టుకు ఏమి జరుగుతుంది?” లూకా 23:27-31

అనేకమంది పుణ్యస్త్రీలు యేసును చూస్తూ, ఏడుస్తూ, గొల్గొతా కొండ వరకు ఆయనను అనుసరించారు. మన ప్రభువు కల్వరి వైపు వెళ్తూ దారిలో ఆగి, రాబోయే భయానక సంఘటనల వాస్తవికతను వారి హృదయాలకు తెలియజేశారు. అనేకమంది అనుభవించబోయే కీడును, అనేకమంది పడిపోబోయే పాపాన్ని గురించి ఆయన ప్రవచించారు. యేసు మరణం బాధాకరమైనదే. అయితే, విశ్వాసులపై హింసలు ఎంత తీవ్రంగా మండుతాయంటే, వాటివల్ల రేగే అగ్ని బాగా ఎండిపోయిన కట్టెలతో రాజేసిన మంటలా ఉంటుంది; అప్పుడు సంభవించే విషాదాలే మరింత ఘోరమైనవి.

ఆ పుణ్యస్త్రీలలో ఒకరైన వెరోనికా మౌనంగా యేసు దగ్గరకు వచ్చారు. ఆమె శుభ్రమైన ముసుగును తీసి, రక్తసిక్తమైన ఆయన ముఖాన్ని దానితో జాగ్రత్తగా తుడిచారు. మాటలు లేని ఈ ప్రేమచర్యను యేసు ప్రశాంతంగా స్వీకరించారు. వెరోనికా చేసిన ఈ చిన్న ప్రేమసేవకు ప్రతిగా, తరువాతి తరాలవారు ఆమె పుణ్యనామాన్ని ఎల్లప్పుడూ దీవిస్తూ, గౌరవిస్తూ వచ్చారు.

మన దివ్యమాత తన దివ్యకుమారుని సిలువ ఎదుట నిలిచినప్పుడు, ఈ పుణ్యస్త్రీలు తన కుమారుణ్ణి కలిసిన సందర్భాల గురించి ధ్యానించి ఉంటారు. ఈ స్త్రీలు యేసుపట్ల చూపిన శ్రద్ధకు, ఆదరణకు ఆమె హృదయం కృతజ్ఞతతో నిండి ఉంటుంది; కరుణతో వారు కార్చిన కన్నీరు ఆమె హృదయాన్ని కదిలించి ఉంటుంది.

అయితే, “యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి; మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి” అన్న యేసు మాటలను గురించి కూడా ఆమె ఆలోచించి ఉంటారు. మరియమాత తప్పక ఈ మాటలను హృదయంలో నిలుపుకొని ఉంటారు. తన కుమారుడు సిలువ వేయబడినప్పుడు ఆమె హృదయం పవిత్రమైన దుఃఖంతో నిండిపోయినా, తన కుమారుడు అందిస్తున్న వరాన్ని తిరస్కరించేవారి గురించే ఆమె అత్యంత లోతుగా దుఃఖించారు. యేసు మరణం అందరి కోసమని, అయినా ఆయన పరిపూర్ణ బలియాగం నుండి ప్రవహించే కృపను అందరూ స్వీకరించరని ఆమె స్పష్టంగా గ్రహించి ఉంటారు.

ఈ పుణ్యస్త్రీలు, వారి పిల్లలు యేసుపట్ల తమకున్న ప్రేమ కారణంగా తరువాత బాధలు అనుభవిస్తారని మరియమాతకు తెలుసు. ఆ శుక్రవారం యెరూషలేములో ఈ పుణ్యస్త్రీలు మొదట పాలుపంచుకున్న దానికంటే మరింత గాఢంగా ఆయన సిలువలో పాలుపంచుకోవడానికి వారికి పిలుపు వస్తుంది. యేసు పునరుత్థానం తరువాత ఈ స్త్రీలు, వారి ఆధ్యాత్మిక వారసులు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం మొదలుపెట్టి, ప్రార్థన ద్వారా ఆయనతో గాఢమైన ఆధ్యాత్మిక ఐక్యతలోకి ప్రవేశించడం ఆరంభించినప్పుడు, వారు ఆనందంతో నిండిపోవడమే కాక, శిష్యత్వపు సిలువను మోయడానికి కూడా ప్రేరేపించబడతారు.

యేసును అనుసరించడంవల్ల కలిగే ఒక “పర్యవసానాన్ని” గురించి ఈ రోజు ధ్యానించండి. మీరు యేసును అనుసరించాలని ఎంచుకుంటే, ఆయన పునరుత్థానంలో పాలుపొందేలా ఆయన శ్రమలలో, మరణంలో కూడా పాలుపంచుకోవడానికి మీకు పిలుపు వస్తుంది. ఈ పుణ్యస్త్రీలకు ఉన్న కరుణతోనే మీ హృదయం కూడా నిండిపోనివ్వండి. పాపజీవితంలో చిక్కుకున్నవారిపట్ల ఆ కరుణను చూపండి. వారి కోసం ఏడవండి. వారి కోసం ప్రార్థించండి. వారిని ప్రేమించండి. క్రీస్తు కారణంగా బాధపడేవారి కోసం కూడా ఏడవండి. మన దివ్యమాత చెక్కిళ్లపై, యెరూషలేములోని ఈ పుణ్యస్త్రీల చెక్కిళ్లపై జారిన కన్నీటిలాగే, మీ కన్నీరు కూడా పవిత్రమైన దుఃఖం నుండి పుట్టినదిగా ఉండనివ్వండి.

నా దుఃఖమాతా, నీ సొంత కుమారుని బాధను చూసి ఈ పుణ్యస్త్రీలు విలపిస్తుండగా నీవు చూశావు. వారు కార్చిన కన్నీటిని, వారి హృదయాలలో కలిగిన కరుణను నీవు చూశావు. నిర్దోషుల బాధలను చూసినప్పుడు నా కళ్లలో కూడా పవిత్రమైన కన్నీరు కలిగేలా నా కోసం ప్రార్థించు; నా హృదయాన్ని కరుణతోను, పరులపట్ల శ్రద్ధతోను నింపు.

ప్రేమగల తల్లీ, పాపంలో జీవించేవారి కోసం దుఃఖించే హృదయం నాకు కలిగేలా కూడా ప్రార్థించు. నీ కుమారుడు అందరి కోసం మరణించాడు, కానీ అనేకమంది ఆయన కరుణను స్వీకరించలేదు. నా ద్వారా ఇతరులు నీ కుమారుణ్ణి తెలుసుకునేలా, పాపం పట్ల నాకున్న దుఃఖం కృపను చేకూర్చే కన్నీరుగా మారనివ్వు.

నా కరుణామయ ప్రభువా, నీ వేదనను, మరణాన్ని లోక రక్షణకు మహిమగల సాధనంగా నేను చూడగలుగుదును గాక. నీ ప్రేమకు తమ హృదయాలను తెరవనివారి కోసం నిజమైన దుఃఖంతో నా హృదయాన్ని నింపు. కృప, కరుణ అత్యంత అవసరమైనవారికి ఆ దుఃఖం వాటిని అందించే సాధనంగా మారుగాక.

నా ప్రియమైన తల్లీ, నాకోసం ప్రార్థించు. యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.

ఇరవై ఏడవ రోజు – అవమానం – వస్త్రాలను తొలగించడం

విషయ సూచిక

ఈ-పుస్తకంగా & పేపర్‌బ్యాక్ పుస్తకంగా కూడా లభిస్తుంది!