ప్ర. మా పొరుగింటి ఆమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె, ఆమె భర్త (ఆయన కతోలికుడు కాదు) తమ పిల్లలను విశ్వాస బోధన తరగతులకు పంపిస్తున్నారు. కానీ దివ్యబలిపూజలో వారిని నేనెప్పుడూ చూడను. దివ్యబలిపూజకు రావాలని వారిని ప్రోత్సహించడానికి నేనేమైనా చెప్పవచ్చా? లేక ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలా?
జ. జోక్యం చేసుకోకుండా ఉండాలా? అస్సలు కాదు, ఏ మాత్రం వెనుకాడకుండా ఉత్సాహంగా ముందడుగు వేయండని నేను అంటాను! అయితే నా ఉద్దేశం వివరిస్తాను.
మీరు చెప్పిన పరిస్థితి, విచారకరంగా, అరుదైనదేమీ కాదు. ముందుగా ఎంతో సానుకూలమైన ఒక విషయాన్ని ప్రస్తావిస్తాను. ఈ దంపతులు తమ పిల్లలను విశ్వాస బోధన తరగతులకు పంపిస్తున్నారన్న విషయమే ఎంతో మంచిది. నా అనుభవంలో, తమ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ ఆచరించని తల్లిదండ్రులు కూడా, తమ పిల్లలకు కనీసం విశ్వాసపు ప్రాథమిక అంశాలైనా నేర్పించాలని భావిస్తారు. తమ పిల్లలకు విశ్వాసాన్ని అందించడానికి తమవల్ల సాధ్యమైనదంతా చేయాలనే గాఢమైన నిశ్చయాన్ని దేవుడు తల్లిదండ్రుల హృదయాల్లో ఉంచుతాడని ఇది సూచిస్తోందని నేను నమ్ముతున్నాను. పిల్లలను విశ్వాస బోధనకు తీసుకురావడం ఎంతో మంచి ఆరంభం, అయితే అంతటితో సరిపోదు.
ప్రజలు అనేక రకాల కారణాలవల్ల దివ్యబలిపూజకు హాజరయ్యే అలవాటును విడిచిపెడతారు. కొందరు కతోలిక సభలోని వ్యక్తులవల్ల బాధపడి ఉంటారు; మరికొందరు సభ బోధనలోని ఏదో ఒక అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేక, అయోమయం లేదా కోపంతో దూరమవుతారు; ఇంకొందరు వెళ్లే అలవాటును కోల్పోతారు; మరికొందరు పనుల్లో ఎంతగా మునిగిపోతారంటే, ఆదివారం ఉదయం ఆలస్యంగా నిద్రలేవడమే సులభమనుకుంటారు. అయితే ఎంతో సాధారణమైనప్పటికీ, పైకి చెప్పుకోని కారణాల్లో ఒకటి ఇదేనని నేను నమ్ముతున్నాను: చాలామంది గత పాపాల కారణంగా తీవ్రమైన అపరాధభావాన్ని మోస్తూ, ఎందుకో తాము ఆ సమాజంలో భాగం కాదన్నట్లు భావిస్తారు. వారు హాజరైనప్పుడు అక్కడ ఇమడలేకపోతున్నట్లు అనిపిస్తుంది; అందువల్ల దూరంగా ఉండటమే సులభమనుకుంటారు. అయితే హాజరు కాకపోవడానికి కారణం ఏదైనా, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు విశ్వాసాన్ని అందించాల్సిన బాధ్యత తమకుందని ఇప్పటికీ గుర్తిస్తారు. కనీసం హృదయాంతరాళంలోనైనా వారికి ఇంకా విశ్వాసం ఉందని ఇది తెలియజేస్తుంది.
కాబట్టి నేను అక్కడి నుంచే మొదలుపెడతాను. మీ విశ్వాసం గురించి సహజంగా మాట్లాడటం ప్రారంభించడానికి అవకాశాలను వెతకండి. మీకు కలిగిన కొన్ని మంచి అనుభవాలను మీతో స్నేహం ఉన్న వ్యక్తితో పంచుకోండి. ఉదాహరణకు, మీ మనసులో నిలిచిపోయే ప్రసంగాన్ని మీరు వింటే, అనువైన సందర్భం చూసుకుని, “గత వారం నేను దేవాలయానికి వెళ్లినప్పుడు గురువుగారు ఈ మాట అన్నారు… అది నాకు ఎంతో ఉపయోగపడింది” అని సహజంగా చెప్పండి. మీ సొంత అనుభవాన్ని పంచుకున్నప్పుడు, ఇతరులకు అది ఏమాత్రం ఒత్తిడిగా అనిపించదు. వారు ఏమి చేయాలో చెప్పకుండా, కేవలం మీ అనుభవాన్ని పంచుకునే విధంగా మీరు మాట్లాడితే, మొలకెత్తి పెరగగల సరైన విత్తనాన్ని నాటడానికి ఇదే ఉత్తమ మార్గం కావచ్చు.
అయితే, దీనికి సమయం పట్టవచ్చు. మీ స్నేహితుల పట్ల అసహనానికి లోనుకాకండి. వారిని తీర్పు తీరుస్తున్నట్లు అనిపించకుండా విత్తనాలు నాటుతూనే ఉండండి. కొన్నిసార్లు సరిగ్గా తగిన సమయంలో సరైన విత్తనాన్ని నాటితే చాలు. ఈ రెండూ కలిసివచ్చినప్పుడు, ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. “ధైర్యంగా ముందడుగు వేయండి!” అని నేను చెప్పడంలోని ఉద్దేశం అదే. మనసు విప్పి, సంకోచం లేకుండా, తరచుగా పంచుకోండి. మీతో స్నేహం ఉన్న వ్యక్తి సంభాషణను కొనసాగించాలని కోరుకుంటే, అది ఎంతో మంచిది. లేకపోతే, దేవాలయంలోని ఏదైనా విషయాన్ని లేదా మీ విశ్వాసానికి సంబంధించిన విషయాన్ని పంచుకోవడానికి మరో అవకాశం కోసం చూడండి.
మరిన్ని కతోలిక ప్రశ్నలు & సమాధానాలు
