ప్ర. ఇక తనకు దేవునిపై విశ్వాసం లేదని నా సోదరుడు నాతో చెప్పాడు. ఈ విషయం అతను మా తల్లిదండ్రులకు చెప్పలేదని నాకు తెలుసు. అతను ఇప్పటికీ మాతోపాటు దివ్యబలిపూజకు వస్తూ, దివ్యసత్ప్రసాదం స్వీకరిస్తున్నాడు. నేను ఏమి చేయాలి?
జ. ముందుగా, మీరు ఆందోళన చెందుతున్నారంటే మీ సోదరునిపై మీకు ఎంతో ప్రేమ ఉందని తెలుస్తోంది. అది మంచి విషయం. అతనిపట్ల ఆ ప్రేమను బలంగా నిలుపుకోండి. నిజమైన ప్రేమ తరచూ ఎన్ని మాటలకన్నా ఎంతో ఎక్కువ మేలు చేయగలదు.
మీ సోదరుని పరిస్థితికి సంబంధించిన వివరాలు నాకు తెలియకపోయినా, కొన్ని సాధారణ ఆలోచనలను మీతో పంచుకోనివ్వండి. వీటిలో కనీసం కొన్నయినా మీకు సహాయపడతాయని ఆశిస్తున్నాను.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఎదిగే క్రమంలో ఇలాంటి దశను అనుభవించడం నిజానికి ఒక మంచి విషయానికి సూచన కావచ్చు. దేవునిపై విశ్వాసం కోల్పోవడం ఎప్పుడూ మంచిది కాదన్నది నిజమే. అయితే, లోతైన స్థాయిలో మరేదైనా జరుగుతోందేమో అని నాకు అనిపిస్తోంది. కొన్ని విధాలుగా ఇది ఎదిగే క్రమంలో సహజమైన భాగం. చిన్నప్పుడు దేవునిపై విశ్వాసముంచాలని మనకు నేర్పిస్తారు; సాధారణంగా మనం అలాగే చేస్తాం. చిన్నపిల్లలకు ఉండే సరళమైన, నిజమైన విశ్వాసం మనకు ఉంటుంది. మనం ఎదుగుతూ పరిపక్వత చెందుతున్నప్పుడు, ఆ విశ్వాసం కూడా పెరిగి పరిపక్వత చెందాలి. మరింత లోతుగా, మరింత వ్యక్తిగతంగా విశ్వాసముంచాలని మనం నిర్ణయించుకోవాలి. మరో మాటలో చెప్పాలంటే, మనకు నిజంగా విశ్వాసం ఉంది కాబట్టే మనం విశ్వసించాలి. సమస్య ఏమిటంటే, కొన్నిసార్లు పరిస్థితులు లేదా సంఘటనలు ఆ ప్రక్రియకు అడ్డుపడతాయి.
ఉదాహరణకు, టీవీలో విన్న ఏదైనా విషయం, లేదా తరగతి గదిలో చెప్పిన విషయం కూడా, మీ సోదరునికి తన విశ్వాసంలోని ఏదో ఒక అంశం గురించి అయోమయం కలిగించి ఉండవచ్చు. అయోమయానికి లోనవడం మంచిది కాకపోయినా, తరచుగా ఒకరు అనుభవించే ఈ “అయోమయం” విషయాలను తెలుసుకొని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల కలుగుతుంది. ఇలా “సందేహించడం” అనే ప్రక్రియ తరచుగా “ప్రశ్నించుకునే” కాలమేనని నేను భావిస్తున్నాను. బహుశా, తాను విశ్వసించడానికి మీరు సహాయం చేస్తారనే ఉద్దేశంతోనే, ఇక తాను విశ్వసించడం లేదని మీ సోదరుడు మీతో చెప్పి ఉండవచ్చు. విషయాలను స్పష్టపరచుకోవడానికి సహాయం అడిగే అతని పద్ధతి అది కావచ్చు.
అదే నిజమైతే, మీరు అనుసరించగల ఉత్తమమైన మార్గాలలో ఒకటిగా నేను దీన్ని సూచిస్తాను. మీ సోదరుడు మళ్లీ ఈ విషయం గురించి ఏదైనా చెప్పేవరకు వేచి ఉండండి; అతను చెప్పినప్పుడు, చిరునవ్వుతో దాని గురించి మరింత చెప్పమని మృదువుగా అడగండి. ఆ తరువాత కేవలం వినండి. అతను ఇలా ఆలోచించడానికి కారణమేమిటో వినండి. దానిని వివరించనివ్వండి. దాని గురించి మాట్లాడనివ్వండి. అతను ఏమి చెప్పినా, ఎక్కువ సమయం వింటూ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గడపమని మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. అతను కొన్ని సమంజసమైన అంశాలను ప్రస్తావించి, మీ దగ్గర మంచి సమాధానం ఉంటే, అతను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ సమాధానం చెప్పండి. మరోవైపు, ఎలా స్పందించాలో మీకు స్పష్టంగా తెలియకపోతే, ఆ విషయాన్నే అతనితో చెప్పండి. ఆ తరువాత కొంత సమయం ఆలోచించడానికి, ప్రార్థించడానికి, అధ్యయనం చేయడానికి వెచ్చించండి; సరైన సమాధానం కోసం దేవుణ్ణి అడగండి. అవసరమైతే, మీరు మీ గురువుగారి సలహా కూడా అడగవచ్చు. మీకు మంచి సమాధానం దొరికిందని అనిపించినప్పుడు, దానిని అతనితో పంచుకోవడానికి మరో అవకాశం కోసం చూడండి. తన ఆందోళనను మీరు గంభీరంగా తీసుకొని, మంచి సమాధానం కనుగొనడానికి ప్రయత్నించారన్న విషయం అతనిని ఆకట్టుకోవచ్చు.
అతను దివ్యబలిపూజకు వెళ్లడం, దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం కొనసాగిస్తున్న విషయానికొస్తే, మనకు విశ్వాసం లేకపోతే దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించకూడదన్నది నిజమే. అయితే ప్రస్తుతానికి నేనైతే ఆ విషయాన్ని మీ సోదరునికీ దేవునికీ వదిలిపెడతాను. మీ సోదరుడు బయటకు వెల్లడించినదానికంటే వాస్తవానికి అతనిలో ఎక్కువ విశ్వాసం ఉండవచ్చు. అంతేకాక, ఈ సంఘర్షణ సమయంలో అతను చేయగల అత్యుత్తమమైన పనులలో దివ్యబలిపూజకు వెళ్లడం ఒకటి కావచ్చు. అయినప్పటికీ, చివరికి ఈ విషయం మీకు ఎంతో భారంగా అనిపిస్తే, మీ తల్లిదండ్రులతో దీని గురించి మాట్లాడి, వారు ప్రార్థనాపూర్వకంగా మీ సోదరునితో మాట్లాడేలా చేయడం మంచిది కావచ్చు. ఎలా ముందుకు సాగాలనే విషయమై వారికి కొన్ని మంచి ఆలోచనలు ఉండే అవకాశం చాలా ఉంది.
మరిన్ని కతోలిక ప్రశ్నలు–జవాబులు
