తెలుగు

ప్ర. రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించవచ్చా?

ప్ర. ఒకే రోజున ఎవరైనా దివ్యబలిపూజలో రెండుసార్లు లేదా మూడుసార్లు కూడా పాల్గొంటే, ప్రతి దివ్యబలిపూజలోనూ దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించవచ్చా?

జ. ఇది ఎంతో మంచి ప్రశ్న. ఎందుకంటే, పరమపవిత్ర దివ్యసత్ప్రసాదంలో మన ప్రభువును స్వీకరించడం భూమిపైన గానీ పరలోకంలో గానీ ఏ మానవుడైనా చేయగల అత్యంత గొప్ప కార్యం. పునీత అగుస్తీను ఇలా అంటారు: “ప్రతిరోజూ [దివ్యసత్ప్రసాదాన్ని] స్వీకరించగలిగే విధంగా జీవించండి.[1] దివ్యసత్ప్రసాదంలో ఉన్న మన ప్రభువే మన అనుదిన ఆహారం అని, పరలోక జపంలో చెప్పినట్లుగా మనం గుర్తుంచుకోవాలి.  విశ్వాసులు ప్రతిరోజూ దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించాలని, వీలైనంతవరకు దివ్యబలిపూజ సమయంలోనే స్వీకరించాలని కతోలిక సభ గట్టిగా సిఫార్సు చేస్తుంది.  దివ్యసత్ప్రసాద స్వీకరణ అత్యంత గొప్ప కార్యం కాబట్టి, రోజులో వీలైనన్ని సార్లు స్వీకరించాలని కొందరు తార్కికంగా భావించవచ్చు.  అయితే, ఈ దృక్పథం ఈ దివ్యసంస్కారంలోని కృపను, అంటే వరాన్ని, పరిగణనలోకి తీసుకోదు. 

దివ్యసత్ప్రసాదంలో మనం పొందే వరాన్ని మరింత బాగా అర్థం చేసుకోవాలంటే, కతోలిక సభతో సహవాసంలో ఉండి, వివేచన వయస్సుకు, సాధారణంగా ఏడు సంవత్సరాల వయస్సుకు, చేరుకున్నవారు మాత్రమే దివ్యసత్ప్రసాద స్వీకరణకు ముందుకు రావచ్చని మనం గుర్తుంచుకోవాలి. కతోలిక సభతో సహవాసంలో ఉండాలంటే, తన ఆత్మపై ఏ మరణకర పాపమూ ఉన్నట్లు వ్యక్తికి తెలిసి ఉండకూడదు.  దివ్యసత్ప్రసాద స్వీకరణ కోసం విశ్వాసులు తమ ఆత్మలను, శరీరాలను సిద్ధం చేసుకోవాలని కూడా కతోలిక సభ కోరుతుంది.  మొదటిగా, ఈ దివ్యసంస్కారంలోని పరలోక ఆహారానికీ, మన రోజువారీ పోషణ కోసం తినే ఆహారానికీ మధ్య ఉన్న తేడాను గుర్తించి, దాని గురించి ధ్యానించడం ద్వారా మన ఆత్మలను సిద్ధం చేసుకుంటాం.  ఇది పవిత్రమైనదానికీ లౌకికమైనదానికీ మధ్య ఉన్న తేడా.  అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి, ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సమాజంలో ఇది ఎంతో అవసరం. ఆహారం సమృద్ధిగా లభించే సమాజాల్లో, మనం సులభంగా ఆహారాన్నే ఒక విగ్రహంగా చేసుకోవచ్చు; దానివల్ల ఎప్పుడూ మన ఆకలిని తీర్చుకోవడానికి ప్రయత్నించడంపైనే ఆధారపడే స్థితికి చేరవచ్చు.  రెండవదిగా, మన పొరుగువారితో మనం నిజంగా శాంతియుతంగా ఉంటూ, వారిని ప్రేమిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మూడవదిగా, ఇప్పటికే చెప్పినట్లుగా, మన మనస్సాక్షిని పరిశీలించుకోవాలి; అవసరమైతే, పశ్చాత్తాప దివ్యసంస్కారంలో మన పాపాలన్నిటినీ మంచి విధంగా, సంపూర్ణంగా ఒప్పుకోవాలి. నాలుగవదిగా, మన అయోగ్యత గురించి మన హృదయాల్లో మౌనంగా ధ్యానించాలి.  దివ్యసత్ప్రసాద స్వీకరణకు సరిగ్గా ముందు మనం పలికే శతాధిపతి మాటలను మన సొంత మాటలుగా స్వీకరించాలి: “ప్రభువా, నీవు నా ఇంటి కప్పు క్రింద ప్రవేశించడానికి నాకు యోగ్యత లేదు; అయితే ఒక్క మాట మాత్రమే పలుకు, నా ఆత్మ స్వస్థత పొందుతుంది.”  చివరిగా, పునీత పేతురుతో కలిసి, “ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు” అని మనం చెప్పగలగాలి.[2]

మన శరీరాలను కూడా సిద్ధం చేసుకోవాలి. దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడానికి కనీసం ఒక గంట ముందు నుంచి నీరు, మందులు తప్ప మరే ఆహారపానీయాలనూ తీసుకోకుండా ఉండటం ద్వారా ఇది జరుగుతుంది. అర్ధరాత్రి నుంచి దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించే వరకు ఆహారపానీయాలను మానివేసే ప్రాచీన ఆచారాన్ని పాటించడం ప్రశంసనీయం.  దివ్యసత్ప్రసాదంలో ఉన్న మన ప్రభువే నిజంగా మీ ఉపవాసాన్ని ముగించే తొలి ఆహారం కావాలి.  అనుదిన దివ్యబలిపూజతో సహా పవిత్ర బలియాగం కోసం స్నానం చేసి, తగిన దుస్తులు ధరించడం ద్వారా కూడా మన శరీరాలను సిద్ధం చేసుకోవాలి.  పెండ్లి వస్త్రం లేకుండా రాజు విందులో కూర్చుని, బయటకు గెంటివేయబడిన వ్యక్తి గురించిన ఉపమానాన్ని గుర్తుంచుకోండి.[3]

వరాలన్నిటిలో అత్యంత గొప్పదైన ఈ వరాన్ని స్వీకరించడానికి మన ఆత్మను, శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో చూసినప్పుడు, ఈ వరాన్ని రోజుకు అనేకసార్లు స్వీకరించాలని మనకు అనిపించవచ్చు. కతోలిక సభ తన వివేకంతో, దివ్యసత్ప్రసాద స్వీకరణను రోజుకు రెండు సార్లకు మాత్రమే పరిమితం చేస్తుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి:  మొదటిది, ఈ దివ్యసంస్కారాన్ని ఏదో ఒక మూఢనమ్మకంగా మార్చకుండా ఉండటం; రెండవది, ఇటే, మిస్సా ఎస్త్ అనే మాటల ప్రాముఖ్యతను విశ్వాసులకు గుర్తుచేయడం.  ఇవి దివ్యబలిపూజ ముగింపులో యాజకుడు పలికే మాటలు. నిజానికి, “మాస్” అనే పదం వీటి నుంచే వచ్చింది. వీటిని ఆంగ్లంలోకి అనువదించడం కష్టం; అయితే అక్షరార్థంగా అనువదిస్తే, “వెళ్లండి, ఆమె పంపబడింది” అని ఉంటుంది.  దీని అర్థం ఏమిటంటే, సమావేశమైన సంఘం, అంటే విశ్వాసులు, బయటకు వెళ్లి దివ్యబలిపూజలో పొందిన కృపను పంచుకోవాలి.  మనం మన ప్రభువును స్వీకరిస్తున్నాం; మన ప్రభువును ఇతరులతో పంచుకోవాలి.  సువార్త ప్రకటించడంలో మన లక్ష్యం ప్రజలను ప్రభువు విందుకు తీసుకురావడమే. 

రోజుకు రెండుసార్లు దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడానికి అనుమతించినా, అది ఉదయం అనుదిన దివ్యబలిపూజకు వెళ్లి, ఆ తరువాత అదే రోజు అంత్యక్రియల లేదా వివాహ దివ్యబలిపూజకు వెళ్లడం వంటి సందర్భాల్లోనే; లేదా శనివారం ఉదయం దివ్యబలిపూజకు వెళ్లి, ఆ తరువాత శనివారం సాయంత్రం దివ్యబలిపూజకు వెళ్లడం వంటి సందర్భాల్లోనే. ఈ రెండవ సందర్భంలో సాయంత్రపు దివ్యబలిపూజ ఆదివారం విధిని నెరవేరుస్తుంది.  అన్నిటికన్నా ముఖ్యంగా, ఒకే రోజులో రెండవసారి దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, అది అంతిమయాత్రా పాథేయంగా ఇచ్చే దివ్యసత్ప్రసాదం అయితే. అంటే, మరణానికి ముందు బహుశా చివరిసారిగా ఒక వ్యక్తి దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం. 

మన అనుదిన ఆహారాన్ని స్వీకరించడంలో, మనం ఆ పరలోక విందులో పాలుపంచుకుంటున్నామని గుర్తుంచుకుందాం. రోజుకు ఎన్నిసార్లు స్వీకరిస్తున్నామనే దానిపై కాకుండా, మనం పొందుతున్న వరంపైనా, బయటకు వెళ్లి ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించగలిగేలా మన ఆత్మలను, శరీరాలను సిద్ధం చేసుకోవడంపైనా మన దృష్టి ఉండాలి. 


మరిన్ని కతోలిక ప్రశ్నలు–జవాబులు 


JPL

1. రోమన్ విశ్వాసబోధిని: త్రెంతు మహాసభ విశ్వాసబోధిని (రాక్‌ఫర్డ్, టాన్ బుక్స్ అండ్ పబ్లిషర్స్,1982) 249.

2. అదే గ్రంథం, 247-248

3. మత్తయి సువార్త 22:12-13.