తెలుగు

పాస్కా అష్టదినోత్సవానికి ప్రార్థనా ధ్యానం

అల్లెలూయా!  అత్యంత మహిమగల ప్రభువైన యేసూ, మహిమ, స్తుతి, ఘనత అన్నీ నీకే!  నీవు సమాధి నుండి లేచావు, పాపమరణాలను జయించావు, పరలోక ద్వారాలను తెరిచావు!  అల్లెలూయా!  అత్యంత మహిమగల ప్రభువైన యేసూ, స్తుతి, ఘనత అన్నీ నీకే!

నా ప్రభువా, నీవు నిశ్శబ్దంగా, సౌమ్యంగా, మహిమాన్వితంగా మృతులలో నుండి లేచి, పతనమైన ఈ లోకానికి నూతన జీవాన్ని ప్రసాదిస్తుండగా, ఆశ పునరుద్ధరించబడుతోంది, అనేక హృదయాలలో ఆనందోత్సాహాలు నిండుతున్నాయి.  మధురమైన యేసూ, నీ పునరుత్థానాన్ని చూసి విశ్వసించేందుకు నాకు విశ్వాస నేత్రాలను ప్రసాదించు.  నా జీవితంలో నీ విజయ ఫలాలను తెలుసుకోవడానికి నాకు సహాయం చేయి.  పునరుత్థానుడవైన నా ప్రభువా, నిన్ను మరింతగా తెలుసుకుంటున్న కొద్దీ, నా సమస్తాన్ని, నేను ఎలా ఉండాలని ఆశిస్తున్నానో అదంతటినీ నీకు అప్పగించేందుకు నాకు సహాయం చేయి.  పునరుత్థానమైన నీ ఆత్మ నుండి ప్రవహించే అపారమైన కారుణ్యంపై నమ్మకం ఉంచేందుకు నాకు సహాయం చేయి.

ప్రియ ప్రభువా, ఎనిమిది రోజుల ఈ పాస్కా అష్టదినోత్సవ వేడుకలో పాస్కా పరమరహస్యంలోకి లోతుగా ప్రవేశించేందుకు నాకు సహాయం చేయి.  ఈ అష్టదినోత్సవంలోని ప్రతి రోజు నీపై నమ్మకం మరింతగా పెరిగే రోజుగా, నీ పునరుత్థాన మహిమలో నీతో ఐక్యత మరింతగా గాఢమయ్యే రోజుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.  

కారుణ్య ప్రభువా, ఈ అష్టదినోత్సవంలోని ఎనిమిదవ రోజైన దైవకారుణ్య ఆదివారంనాడు విశేషంగా కుమ్మరించబడే కారుణ్యాన్ని మహిమాన్వితంగా వేడుక చేసుకోవడానికి మా సభ సిద్ధమవుతుండగా, నీవు ప్రసాదించదలచిన సమృద్ధియైన కృపను, కారుణ్యాన్ని స్వీకరించేందుకు మునుపెన్నడూ లేనంతగా నా హృదయాన్ని తెరవడానికి నాకు సహాయం చేయి.  నా జీవితంలోనూ, నీ బిడ్డలందరి జీవితాలలోనూ నీ కారుణ్యాన్ని కుమ్మరించు.  నా కుటుంబాన్ని, స్నేహితులను, సమాజాన్ని, సమస్త లోకాన్ని నీకు సమర్పిస్తున్నాను.  విశ్వాసుల కోసం, పాపుల కోసం, దారితప్పి అయోమయంలో ఉన్నవారి కోసం, గురువర్గం కోసం, మా పరిశుద్ధ పిత కోసం, నీకు ఎంతో ప్రియమైన బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను.  నీవు పంచి ఇవ్వదలచిన సమృద్ధియైన కృప కోసం మేమందరం ఎంతో ఆశతో ఆతురంగా ఎదురుచూసెదము గాక.  

పునరుత్థానుడవైన నా కారుణ్య యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను.  యేసూ, నేను నీపై నమ్మకం ఉంచుతున్నాను!

అల్లెలూయా!  అత్యంత మహిమగల ప్రభువైన యేసూ, మహిమ, స్తుతి, ఘనత అన్నీ నీకే!  నీవు సమాధి నుండి లేచావు, పాపమరణాలను జయించావు, పరలోక ద్వారాలను తెరిచావు!  అల్లెలూయా!  అత్యంత మహిమగల ప్రభువైన యేసూ, స్తుతి, ఘనత అన్నీ నీకే!

పాస్కా ఆదివారం గురించి మరింత సమాచారం

ఈస్టరు అష్టదినోత్సవానికి ప్రార్థనలు & ధ్యానాలు

జపమాల – మహిమ పరమరహస్యాలు (పవిత్ర గ్రంథ వచనాలతో)

దైవకారుణ్య ఆదివారానికి సిద్ధపరిచే నవదిన ప్రార్థన (నవదిన ప్రార్థనలో మూడవ రోజు నుండి తొమ్మిదవ రోజు వరకు)

ఈస్టరు అష్టదినోత్సవానికి ఇతర ప్రార్థనలు:

పాస్కా ప్రకటన – ఎక్సుల్టెట్!

పునీత ఫౌస్టీనా దైవకారుణ్య లితనీ

దైవకారుణ్యంపై నమ్మకం


ఈస్టరు వారానికి దైనందిన ధ్యానాలన్నీ

దైవకారుణ్య ధ్యానాలు