పవిత్ర గ్రంథ పఠనం: కింది వచనభాగాల్లో కొన్నింటిని లేదా అన్నింటిని ప్రార్థనాభావంతో చదవండి:
మత్తయి 26:47–56
మార్కు 14:42–53
లూకా 22:47–53
యోహాను 18:1–24
నేపథ్యం: యూదా ముద్దుతో యేసుకు ద్రోహం చేయడం, సైనికులు యేసును అరెస్టు చేయడం, పేతురు కత్తితో ఒక సైనికుని చెవిని నరికివేయగా యేసు అతనిని స్వస్థపరచడం గురించి మత్తయి, మార్కు, లూకా వివరిస్తారు. యేసు తనకు తెలియదని పేతురు నిరాకరించడాన్ని, అన్నా యేసును విచారించడాన్ని కూడా యోహాను వివరిస్తారు. యేసును కయఫా వద్దకు పంపే ముందు ఆయనను ప్రశ్నించిన మొదటి ప్రధాన యాజకుడు అన్నా. ఆ సమయంలో ప్రధాన యాజక పదవిలో ఉన్నది అన్నా కాకపోయినా (కయఫా ఆ పదవిలో ఉన్నాడు), ఈ కుట్రలో అన్నా కూడా పాలుపంచుకున్నాడని స్పష్టమవుతుంది.
అర్ధరాత్రి రహస్యంగా ఈ అరెస్టు జరిగింది. శిష్యులు చెల్లాచెదురైపోయినా, పేతురు దూరం నుంచి వెంబడిస్తాడు. అన్నా యేసును విచారిస్తున్న సమయంలో, యేసు తనకు తెలియదని పేతురు మొదటిసారి నిరాకరిస్తాడు.
ధ్యానం: ఉపయోగకరంగా ఉంటే కింది అంశాలను ఆధారంగా చేసుకొని, ఈ దృశ్యాన్ని ప్రార్థనాభావంతో ధ్యానించండి.
- ఈ దృశ్యాన్ని ధ్యానించండి. యేసు అప్పుడే యూదాతో సహా తన శిష్యులతో పాస్కా పండుగను జరుపుకున్నారు. ఆయన యూదా పాదాలను కడిగి, దివ్యసత్ప్రసాదంలో మొదటిసారి తన పవిత్ర శరీరరక్తాలను అతనికి ఇచ్చారు. ఆ తరువాత, యూదా తనకు ద్రోహం చేయడానికి వస్తాడని ఎదురుచూస్తూ యేసు ఒక గంటసేపు ప్రార్థనలో గడిపారు.
- యూదాలోని ఆందోళనను, అంతరంగ సంఘర్షణను ఊహించండి. అతను ఇలా ఎందుకు చేస్తాడు? తన ద్రోహానికి సంకేతంగా అతను యేసు వద్దకు వచ్చి ఆయనను ముద్దుపెట్టుకోవడాన్ని ఊహించండి. యేసు అతనితో ఇలా అన్నారు: “యూదా, ముద్దుతో మనుష్యకుమారునికి ద్రోహం చేస్తావా?”
- పేతురు కత్తితో దాడిచేసి యేసును రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ యేసు తన శ్రమలను స్వీకరించాలని నిశ్చయించుకొని ఇలా అంటారు: “నీ కత్తిని తిరిగి దాని స్థానంలో పెట్టు; కత్తి పట్టినవారందరూ కత్తివల్లనే నశిస్తారు. నేను నా తండ్రిని వేడుకోలేనని, ఆయన వెంటనే పన్నెండు సైన్యదళాల కంటే ఎక్కువ మంది దేవదూతలను నా కోసం పంపరని నీవు అనుకుంటున్నావా?” పరలోక దేవదూతలను పిలువగలిగినా, అలా చేయకుండా లోక రక్షణ కోసం ఈ కుట్రకు తలవంచిన యేసు వినయాన్ని ధ్యానించండి.
- దేవుని కుమారుడైన యేసును గొలుసులతో బంధించి, ఆయనను నేరస్థునిలా చూసిన సైనికుల క్రూరత్వాన్ని ధ్యానించండి.
- భయంతో నిండిపోయి చెల్లాచెదురవుతున్న శిష్యులను చూడండి.
- ఆ తరువాత యేసును మాజీ ప్రధాన యాజకుడైన అన్నా వద్దకు తీసుకువెళ్తారు. పేతురు బయట వేచివుంటూ, యేసు తనకు తెలియదని మొదటిసారి నిరాకరిస్తాడు.
- యేసుకు అన్నాతో జరిగిన సంభాషణను యోహాను 18:19–24 నమోదు చేస్తుంది. ఈ విచారణ సమయంలో అన్నా దుష్టత్వాన్ని, యేసు ధైర్యాన్ని ధ్యానించండి.
ప్రధాన చిత్రం: దూచ్చో ది బువోనిన్సెఞ్ఞా – అన్నా ఎదుట క్రీస్తు
- జీవిత నిర్ణయాలు మరియు సంకల్పాలు
- మ్రానికొమ్మల ఆదివారం
- పవిత్ర గురువారానికి దారితీసే సంఘటనలు
- చివరి భోజనం
- తోటలో వేదన
- యేసును బంధించి అన్నా ఎదుటకు తీసుకురావడం
- యేసును కయఫా ఎదుటకు తీసుకురావడం
- యేసును పిలాతు ఎదుటకు తీసుకురావడం
- యేసును హేరోదు ఎదుటకు తీసుకురావడం
- పిలాతు జరిపిన రెండవ విచారణ
- యేసు తన సిలువను మోయడం, సిలువ వేయబడటం
- సిలువపై నుండి యేసు పలికిన మాటలు
- సిలువపై యేసు మరణం
- తన తల్లి ఒడిలో యేసు మృతదేహం
- యేసును సమాధిలో ఉంచడం
- పవిత్ర శనివారం
