తెలుగు

ప్ర. పచ్చబొట్టు వేయించుకోవడం

ప్ర. నా స్నేహితుల్లో ముగ్గురికీ, నాకూ ఒకే నెలలో 18 ఏళ్లు నిండుతాయి. పచ్చబొట్లు వేయించుకుని ఈ సందర్భాన్ని జరుపుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. పచ్చబొట్టు వేయించుకోవడం పాపమని మా అమ్మ అంటున్నారు. సభ బోధించేది అదేనా?

జ. పచ్చబొట్లు పాపమా? ఈ ప్రశ్నకు సమాధానం మనం కోరుకునేంత సూటిగా ఉండకపోవచ్చు. మీరు మంచి నిర్ణయానికి రావడానికి తోడ్పడేలా పవిత్ర గ్రంథం నుంచి, కతోలిక బోధన నుంచి కొన్ని విషయాలను మీ ముందుంచడమే నేను చేయగల ఉత్తమమైన పని.

పాత నిబంధనలోని లేవీయకాండములో, “ … మీ ఒంటిపై పచ్చబొట్లు వేయించుకోకండి” (19:28) అనే స్పష్టమైన ఆజ్ఞను చదువుతాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పునీత పౌలు, “ … మీ శరీరం పవిత్రాత్మ ఆలయం … ” (6:19) అని వివరిస్తున్నారు. చివరిగా, కతోలిక సభ విశ్వాస సంగ్రహం ఇలా చెబుతోంది: “కేవలం చికిత్సాపరమైన వైద్య కారణాల కోసం చేసినప్పుడు తప్ప, ఉద్దేశపూర్వకంగా నేరుగా …, అమాయక వ్యక్తులపై చేసే అంగవికలీకరణలు, … నైతిక నియమానికి విరుద్ధమైనవి” (#2297).

అయితే పచ్చబొట్ల విషయంలో వీటన్నిటికీ అర్థమేమిటి? మొదటిగా, పచ్చబొట్లు “స్వతహాగా చెడ్డవి” అని దీని అర్థమని నేను అనుకోవడం లేదు. ప్రతి పరిస్థితిలోనూ ప్రతి పచ్చబొట్టూ తప్పేనని చెప్పడం పొరపాటు అవుతుందని నా ఉద్దేశం. ఉదాహరణకు, కొన్ని సంస్కృతులలో ఒక వ్యక్తికి వివాహమైందో లేదో సూచించడానికి నుదుటిపై ఒక గుర్తు పెడతారు. ఇథియోపియాకు చెందిన అనేకమంది క్రైస్తవులకు తమ క్రైస్తవ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి నుదుటిపై సిలువను పచ్చబొట్టుగా వేయించుకునే ఆచారం ఉంది. ఇంకా అనేక ఇతర సంస్కృతులలో పచ్చబొట్లు ఎన్నో విధాలుగా భాగమై ఉన్నాయని తెలుసుకోవడానికి మనం చరిత్ర పుస్తకాలను చూస్తే చాలు.

పచ్చబొట్ల నైతికత గురించి చర్చించేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలలో సంస్కృతి ఒకటని నేను నమ్ముతున్నాను. ఈ సాంస్కృతిక ఉదాహరణలలో అనేకచోట్ల పచ్చబొట్లు సామాజికంగా ఆమోదించబడటమే కాకుండా, తరచుగా వాటిని వేయించుకోవాలని సమాజం ఆశించడం కూడా ఒక ప్రధానాంశం. అయితే, అనేక దేశాలలో పరిస్థితి అలా ఉండదు.  మరి మీ దేశంలో, మీ సంస్కృతిలో పచ్చబొట్టు వేయించుకోవడం సంగతేమిటి?  పరిగణించవలసిన మూడు విషయాలను మీ ముందుంచుతాను. 

మొదటిగా, మీ శరీరాన్ని దేవుడు సృష్టించాడు; అది ఉన్నట్టుగానే అందంగా ఉంది. మీ శరీరంపై అదనంగా ఒక శాశ్వతమైన గుర్తు వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొందరు దానిని శరీరాన్ని వికృతం చేసుకోవడమని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల మీ శరీర సహజ సౌందర్యం పెరగదు. పచ్చబొట్టు మన సంస్కృతిలో తప్పనిసరి భాగం కాదు కాబట్టి, దానిని వేయించుకోవడానికి సరైన కారణమేమీ లేదు. మీ శరీరం నిజంగా పవిత్రాత్మ ఆలయమని గుర్తుంచుకోండి. అందువల్ల దేవుని ఆలయాన్ని మనం ఎలా గౌరవిస్తామో, మన శరీరాన్ని కూడా అలాగే గౌరవించాలి. అదనంగా ఎలాంటి శాశ్వతమైన మార్పూ నిజంగా అవసరం లేని విధంగా దేవుడు ఇప్పటికే ఈ “ఆలయాన్ని” రూపొందించి, అలంకరించాడు.

రెండవదిగా, అయినా సరే మీరు పచ్చబొట్టు వేయించుకోవాలని నిర్ణయించుకుంటే, దయచేసి వీటిని నివారించండి: దయ్యాలకు సంబంధించిన చిత్రాలు, వికారమైన చిత్రాలు, దిగ్భ్రాంతి కలిగించే చిత్రాలు, జాతకాలకు సంబంధించిన చిత్రాలు, ఒక్కమాటలో చెప్పాలంటే క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైన ఏ చిత్రమైనా సరే. ఇలాంటి ఏ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్నా అది నిశ్చయంగా పాపం కిందకే వస్తుంది.

మూడవదిగా, తోటివారి ఒత్తిడికి లోనై మీరు ఇలా చేయడం లేదని నిర్ధారించుకోండి. కొన్నిసార్లు మన స్నేహితులు చేస్తున్నారనీ, మనం కూడా వారితో కలిసిపోవాలనీ మాత్రమే కొన్ని పనులు చేస్తాం. ఇది ఎప్పటికీ సరైన కారణం కాదు. మన స్నేహితులు నిజమైన స్నేహితులైతే, ఇలాంటి నిర్ణయాలు తీసుకోమని మనపై ఒత్తిడి చేయరు; అలాగే మనం “అందరిలాగే చేయకూడదని” నిర్ణయించుకున్నా మనల్ని చిన్నచూపు చూడరు. ఇతరుల ఒత్తిడి వల్ల మీరు ఈ నిర్ణయం తీసుకోవడం లేదని నిర్ధారించుకోండి.

ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. పచ్చబొట్టు వేయించుకోవడం గురించి మీకు ఇంకా అయోమయంగా ఉంటే, దాని గురించి ఆలోచించడానికి, ప్రార్థించడానికి మరింత సమయం కేటాయించమని సూచిస్తున్నాను. మీరు దేవుని చిత్తానికి పూర్తిగా మనసు తెరిచి ఉంటే, ఆయన మిమ్మల్ని సరైన దిశలో నడిపించి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయం చేస్తాడు.


మరిన్ని కతోలిక ప్రశ్నలు–జవాబులు