తెలుగు

ప్ర. ఆదాము ఆపిల్ పండును ఎందుకు తిన్నాడు?

ప్ర. ఆదాము ఆపిల్ పండును ఎందుకు తిన్నాడు?

జ. సరళంగా చెప్పాలంటే, ఆపిల్ పండును తినడం తనకు మేలు చేస్తుందని సర్పం (అపవాది) ఆదామును నమ్మించింది. దాన్ని తింటే ఆదాము “దేవునిలా అవుతాడు” అని చెప్పింది. విచారకరంగా, ఆదాము ఈ అబద్ధాన్ని నమ్మి, మంచి చెడుల జ్ఞానవృక్షపు పండును తినవద్దని తనకు చెప్పిన దేవునికి అవిధేయత చూపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే మొదటి పాపం. దీని ఫలితంగా మానవజాతి, మనం ఆదిమ నిర్మలత్వం అని పిలిచే స్థితి నుండి పతనమైంది. అయితే, దీన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి, ఈ కథనమంతటినీ విశాల దృక్పథంతో పరిశీలిద్దాం.

మొదటగా, ఆదాము నిజంగానే ఆపిల్ పండును తిన్నాడా? తిని ఉండవచ్చు, తినకపోయి ఉండవచ్చు కూడా. ఈ కథనాన్ని మనం “అక్షరార్థంగా” చదవకూడదని అర్థం చేసుకోవడం ముఖ్యం. అంతమాత్రాన ఈ కథనం సత్యం కాదని అర్థం కాదు. కార్డినల్ రాట్సింగర్ (ఆ తరువాత పదహారవ బెనెడిక్ట్ పాపుగారైన వారు) తన “ఆదిలో …: సృష్టి, పతనాల కథనంపై కతోలిక అవగాహన” అనే పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఇచ్చారు (డబ్ల్యూ. ఎం. బి. ఈర్డ్‌మన్స్ పబ్లిషింగ్). ఆ పుస్తకంలో కార్డినల్ రాట్సింగర్ ఇలా పేర్కొన్నారు: “భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ద్వారా మనకు పరిచయమైన పద్ధతికి భిన్నంగా, బైబిలులోని సృష్టి కథనాలు వాస్తవికత గురించి మరో పద్ధతిలో తెలియజేస్తాయని స్పష్టమైంది.” ఈ కథనాలు “ప్రతీకలు తెలియజేసే పద్ధతిలో సత్యాన్ని తెలియజేస్తాయి — ఉదాహరణకు, గోథిక్ శైలిలోని ఒక కిటికీ, దాని ద్వారా ప్రసరించే కాంతి ప్రభావాల వల్ల, అది చిత్రించే రూపాల వల్ల వాస్తవికతపై మనకు లోతైన అవగాహనను కలిగించినట్లే” అని ఆయన మరింత వివరించారు.

మరో మాటలో చెప్పాలంటే, ఆదాము హవ్వల కథనం సత్యమే. అయితే, ఒక విజ్ఞానశాస్త్ర పుస్తకం వాస్తవాలను తెలియజేసే పద్ధతిలోనే అది సత్యంగా ఉండాలని లేదు. ఒక విజ్ఞానశాస్త్ర పుస్తకం ఈ ప్రపంచంలోని భౌతిక సత్యాలను ఉన్నవి ఉన్నట్లుగా వివరిస్తూ, సత్యాన్ని అక్షరార్థంగా తెలియజేస్తుంది. ఆదాము హవ్వల కథనం ప్రతీకాత్మక కథన రూపంలో సత్యాన్ని తెలియజేస్తుంది. ఆ ప్రతీకాత్మక కథనంలో వివరించినట్లుగా ఆదాము అక్షరాలా ఆపిల్ పండును తిన్నాడా లేదా అనేది ముఖ్యం కాదు. ఆ కథనం తెలియజేసే సత్యమే ముఖ్యం.

మరి అది తెలియజేసే సత్యం ఏమిటి? మన ఆదితల్లిదండ్రులు అవిధేయతతో దేవుని నుండి వైదొలిగారనే వాస్తవాన్ని అది మనకు తెలియజేస్తుంది. దాని పర్యవసానంగా, దేవుడు వారిని ఏ ఆదిమ నిర్మలత్వంలోను, తనతో ఏ ఐక్యతలోను ఉండేందుకు సృష్టించాడో, ఆ స్థితి నుండి వారు పతనమయ్యారు. కాబట్టి, దేవునికి విధేయత చూపడం కంటే అవిధేయత చూపడమే తనకు మేలనే అబద్ధాన్ని నమ్మి, స్వార్థపూరిత ఉద్దేశాలతో ఆదాము “పండును తిన్నాడు” అనేదే సమాధానం. అతడు స్వార్థంతో ప్రవర్తించి, దేవుని సత్యాన్ని నమ్మడంలో విఫలమయ్యాడు.


మరిన్ని కతోలిక ప్రశ్నలు–జవాబులు