ప్ర. ప్రపంచంలోని అనేక ఇతర మతాలలో ఒక్కొక్క మతం గురించి సభ ఏమనుకుంటుంది?
జ. మీ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఏమిటంటే… మీరు ఏ మతం గురించి, ఆ మతంలోని ఏ అంశం గురించి మాట్లాడుతున్నారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది! మన సభ బోధించే రెండు మార్గదర్శక సూత్రాలను మీకు తెలియజేస్తాను.
మొదటిగా, కతోలికులమైన మనం ప్రపంచంలోని ఇతర మతాలలో ఉన్న సత్యమైన దేనినీ తిరస్కరించమని తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా చెప్పాలంటే, వివిధ కాలాల్లో, వివిధ సంస్కృతులలో స్థాపించబడిన ప్రపంచ మతాలు మానవ జీవితానికి సంబంధించిన అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడంలో సహాయపడటానికి ఏర్పడ్డాయి. జీవితానికి అర్థం ఏమిటి? మనం ఇక్కడ ఎందుకు ఉన్నాం? మరణానంతర జీవితం ఉందా? నైతికంగా మేలైనది ఏది? చెడు ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏ యుగంలో, ఏ సంస్కృతిలో లేదా ఏ మతపరమైన నేపథ్యంతో జన్మించినా, ఈ ప్రశ్నలన్నీ మన మనస్సుల్లో, హృదయాల్లో తలెత్తుతాయి. కాబట్టి కాలారంభం నుంచి మతపరమైన మార్గాల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయనేది అర్థం చేసుకోదగిన విషయమే.
ప్రపంచంలోని మతాలను పరిశీలించినప్పుడు, వాటిలో సత్యాలు ఉన్నాయని మనకు తప్పక కనిపిస్తుంది. కొన్ని మతాలు ఒకే దేవునిపై విశ్వాసాన్ని ప్రకటిస్తాయి. కొన్ని మతాలు నైతికంగా మేలైనదాన్ని అన్వేషించాలని బోధిస్తాయి. మనకు ఆధ్యాత్మికమైన ఆత్మ ఉందనీ, మరణానంతర జీవితానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలనీ కొన్ని మతాలు బోధిస్తాయి. ఈ బోధనలన్నీ కతోలికులుగా మనం విశ్వసించే వాటికి అనుగుణంగా ఉన్నాయి. అందువల్ల ఇతర మతాలలో మనకు సత్యమైనదిగా కనిపించే దేనినైనా మనం ప్రశంసిస్తూ, మనస్ఫూర్తిగా సమర్థిస్తాము.
అయితే, దీనితోపాటు అర్థం చేసుకోవలసిన మరో అతి ముఖ్యమైన మార్గదర్శక సూత్రం ఉంది. అదేమిటంటే, అనేక మతాలన్నిటిలో సత్య పరిపూర్ణత కతోలిక సభలోనే ఉందని కతోలికులమైన మనం విశ్వసిస్తాము. దీనికి అర్థం ఏమిటి? ఇతర మతాలలో సత్యానికి సంబంధించిన అంశాలు ఉండవచ్చునుగానీ, జీవితం, నైతికత, సత్యం పట్ల అవగాహనలో కతోలిక విశ్వాసం కంటే మరింత సంపూర్ణమైన మతం ఏదీ లేదని దీని అర్థం.
ఆ సత్యంతోపాటు, అందరికీ రక్షకుడు ఒక్కరేనని మనం అంగీకరిస్తామని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం! అంటే హిందువులైనా, యూదులైనా, ముస్లింలైనా, బౌద్ధులైనా, మరెవరైనా, అందరికీ పరలోకానికి ఏకైక మార్గం యేసు క్రీస్తే! కాబట్టి మరొక మతాన్ని అనుసరించే వ్యక్తి నిత్య రక్షణ అనే మహిమాన్వితమైన వరాన్ని పొందితే, అది మానవాళి అంతటికీ రక్షకుడైన యేసు క్రీస్తు జీవితం, మరణం, పునరుత్థానం ద్వారానే లభిస్తుంది.
అయితే ఇతర మతాల గురించి మనం ఏమనుకుంటున్నాం? వాటిలో మంచివి, సత్యమైనవి అన్నిటినీ మనం ప్రశంసిస్తాం. అయితే మన కతోలిక విశ్వాసంలో సంపూర్ణంగా వెల్లడైన దేవుని పరమ సత్యాన్ని కూడా మనం అంగీకరిస్తాం. నిజానికి, ప్రతి కాలానికి, సంస్కృతికి, మతానికి చెందిన ప్రజలందరూ కతోలిక సభలో మనకు అత్యంత సంపూర్ణంగా వెల్లడైన క్రీస్తు యేసును తెలుసుకోవాలనేదే మన హృదయపూర్వక ఆకాంక్షగా ఉండాలి.
మరిన్ని కతోలిక ప్రశ్నలు & సమాధానాలు
