ప్ర. నేను ఎందుకు సృష్టించబడ్డాను?
జ. ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్న ఎంతో మంచి విశ్వాసోపదేశ గ్రంథం ఒకటి ఉంది. దాని పేరు బాల్టిమోర్ విశ్వాసోపదేశ గ్రంథం. దాని మొదటి విభాగం పేరు “మానవుని పరమ గమ్యం గురించి.” అందులో ప్రశ్నోత్తరాలు ఇలా ప్రారంభమవుతాయి:
ప్ర. లోకాన్ని ఎవరు సృష్టించారు?
జ. దేవుడు లోకాన్ని సృష్టించారు.
ప్ర. దేవుడు ఎవరు?
జ. దేవుడు ఆకాశానికీ భూమికీ, సమస్తానికీ సృష్టికర్త.
ప్ర. మానవుడు అంటే ఏమిటి?
జ. మానవుడు శరీరం, ఆత్మలతో కూడి, దేవుని స్వరూపంలో, ఆయన పోలికలో సృష్టించబడిన ప్రాణి.
ప్ర. దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించారు?
జ. ఈ లోకంలో ఆయనను తెలుసుకోవడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయనకు సేవ చేయడానికి, పరలోకంలో ఆయనతో నిత్యమూ ఆనందంగా ఉండడానికి దేవుడు నన్ను సృష్టించారు.
బాల్టిమోర్ విశ్వాసోపదేశ గ్రంథం ప్రారంభ భాగం అతి సరళంగా, ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు అనిపించినా, అది ఎంతో లోతైన తాత్త్విక ప్రశ్నలను ప్రస్తావిస్తుంది. ఈ మొదటి నాలుగు ప్రశ్నలే ప్రార్థనలో ధ్యానించడానికి ఎంతో గొప్ప ప్రశ్నలు. సమస్తానికీ సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అనంతుడు అయిన దేవుడు మీరు తనను తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. తన స్వరూపంలో, తన పోలికలో మిమ్మల్ని సృష్టించిన దేవుడు మీరు తనను ప్రేమించాలని కోరుకుంటున్నారు. ఇతరులు తన వద్దకు నడిపించబడేలా, ఈ లోకంలో మీరు తనకు సేవ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. చివరిగా, మనం పరలోకంలో తనతో నిత్యమూ ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనం దీన్ని ఎలా సాధించగలం? మార్గమూ, సత్యమూ, జీవమూ అయిన ఆయన కుమారుడు యేసు క్రీస్తును అనుసరించడం ద్వారా మాత్రమే. నాలుగు సువార్తల వృత్తాంతాలన్నింటినీ మనం ధ్యానిస్తే, వాటన్నింటిలో ప్రధానంగా కనిపించే ఇతివృత్తం ఇదే: తండ్రియైన దేవుడు మనం తనను ఎలా తెలుసుకోవాలో, ఎలా ప్రేమించాలో, ఎలా సేవించాలో, తనతో నిత్యమూ ఆనందంగా ఎలా ఉండాలో మనకు చూపించడానికి తన కుమారుణ్ణి లోకంలోకి పంపించారు. అంతిమంగా, మనం సృష్టించబడింది సరిగ్గా ఇందుకోసమే!
JL